మళ్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ మురళీమోహన్
రాజమండ్రి, జూలై 11, (న్యూస్ పల్స్)
Former MP Murali Mohan is back in politics
టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మురళీమోహన్ రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తన పొలిటికల్ రీఎంట్రీపై రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు తనను ఆహ్వానించిన మాట నిజమనేనని, అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. రాజమండ్రికి వచ్చిన సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలను, రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని అభినందించాలని వచ్చినట్లు తెలిపారు.
తన హయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్, ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు చేశానని, డబ్బులు ఎలా సంపాదించాలో తనకు తెలుసునని, అక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తన మీద చేసిన ఆరోపణల్ని మురళీమోహన్ ఖండించారు. తాను ఇసుక అమ్ముకున్నానంటూ మాజీ ఎంపీ భరత్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో రాణిస్తున్నారని, ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఎవరు శంకుస్థాపన చేశారో మాజీ ఎంపీ మార్గాని భరత్ గుండె మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు.
ఈ ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తా అన్నారు. మార్గాని భరత్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రెస్ మీట్ ను లక్షల మంది చూస్తారని, ఆదిరెడ్డి వాసు మాట్లాడితే వేలల్లోనే చూస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్ చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి మాజీ ఎంపీ మురళీమోహన్ చాలా కృషి చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అన్నారు. కానీ ఒకే నిర్మాణానికి రెండు శిలాఫలకాలు భారతదేశంలో ఎక్కడా చూడబోమని, ఏపీలో వైసీపీ పాలనతో అది సాధ్యమైందని ఎద్దేవా చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో మార్గాని భరత్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నారు. ఒకవేళ మాజీ ఎంపీ మార్గాని భరత్ నిజంగా రాజమండ్రిని అభివృద్ధి చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 70 వేల మెజారిటీ వచ్చేది కాదన్నారు.
పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే రాజకీయ ఉనికి ఉంటుందని మార్గాని భరత్‌కు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హితవు పలికారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనే మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం రూ. 100 కోట్లు నిధులు ఇస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ హయాంలో రోజుకి 30 కిలోమీటర్ల హైవే రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మౌలిక సదుపాయాలు కావాలన్నారు.
Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news