Focus on filling nominated posts | నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ | Eeroju news

Focus on filling nominated posts

నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్

విజయవాడ, ఆగస్టు 8, (న్యూస్ పల్స్)

Focus on filling nominated posts

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్లు పార్టీ నేతలు పని చేసిన విధానం, ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు, భవిష్యత్ అవసరాలు, ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకొని ఈ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ జాబితాపై క్లారిటీ రానున్నట్టు సమాచారం. పార్టీలో ఎవరికి ఏ నామినేటెడ్ పోస్టు వస్తుందనే విషయం పక్కన పెడితే… అసలు కూటమి పార్టీల మధ్య సర్దుబాటు మెయిన్ టాస్క్‌గా ఉంది. కూటమి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతలా కవ్వించినా కూటమి నేతలు ఎక్కడా గీత దాటకుండా పని చేస్తూ వచ్చారు. ఇకపై కూడా అలానే ఉండాలన్న ఆలోచనతో ఉన్నారు.

సీట్ల సర్దుబాటు నుంచి మంత్రి వర్గ విస్తరణ వరకు అన్ని విషయాల్లో సామరస్యపూరకంగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటి వరకు చేసిందంతా కూడా కీలకమైన నేతల మధ్య పదవీ పంపకాలు కాబట్టి అంతా సర్ధుబాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టు భర్తీ పార్టీలో చాలా కీలకం. భవిష్యత్ నాయకత్వాన్ని  తయారు చేసుకోవాడనికి ఇదో వేదికగా ఉపయోగపడుతుంది. అందుకే దీని కోసం అన్ని పార్టీల నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. అధికారంలో తమ పార్టీ ఉంటే ఏదో ఒక నామినేటెడ్ పదవి తెచ్చుకుంటే భవిష్యత్ లీడర్‌గా ఎదగవచ్చని ఆశపడుతుంటారు. అలాంటి ఆశలు ఉన్న  నేతలు వేలల్లో ఉంటారు. కానీ నామినేటెడ్ పదువులు మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి.

ఒకే పార్టీ అధికారంలో ఉంటే మాత్రం అన్నీ ఒకే పార్టీకి వస్తాయి. కాబట్టి అక్కడ సమస్య ఉండదు. కానీ ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ మూడు పార్టీలతో కలిసిన కూటమి అధికారంలో ఉంది. అందుకే ఇక్కడ నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీడీపీకి అధిక భాగం దక్కనున్నాయి. తర్వాత జనసేనకు ప్రయార్టీ ఉంటుంది. అనంతరం బీజేపీ నేతలకు ఇస్తారు. అయితే అది ఏ నిష్పత్తిలో ఉండాలనేది అసలు మేటర్. దీని కోసం మూడు పార్టీల అగ్రనేతలు ఓ ఫార్ములా ఆలోచించారని సమాచారం అందుతోంది. ఎక్కువ సీట్లు ఉన్న టీడీపీకి 60 శాతం వరకు నామినేటెడ్ పదువులు ఇవ్వాలని తర్వాత జనసేనకు 25 శాతం, బీజేపీకి 15 శాతం పదవులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది.

అలాంటిదేమీ లేదని టీడీపీ నుంచి అందుతున్న సమాచారం. బీజేపీ, జనసేనకు 20 శాతం వరకు మాత్రమే పదవులు ఇస్తారని అంటున్నారు. పోటీ చేసిన సీట్ల ప్రకారమే ఈ పంపిణీ ఉంటుందని అంటున్నారు. మరో వారం పదిరోజుల్లోనే వీటన్నింటిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. అప్పటి వరకు ఎవరికి నచ్చిన నెంబర్‌ వాళ్లు చెబుతుంటారని వాటిని నమ్మొద్దని కేడర్‌కు సూచిస్తున్నారు. టీడీపీ అధినేత మాత్రం ఎంత శాతం తమకు దక్కినా వాటిలో పార్టీకి ఆయా నేతలు చేసిన పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారని వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారని ఆయా ప్రాంతాల్లో కేడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.

ఆ ప్రాంతాల్లో పార్టీ కోసం ఎవరు ఎలా కష్టపడ్డారు… ఎవరికి ఎలాంటి పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందనే విధంగా అభిప్రాయప సేకరణ జరుగుతోందట. వీలైనన్ని మార్గాల్లో రిపోర్ట్స్  తెప్పించుకుంటున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ మార్గాల ద్వారానే సమాచారం తెప్పించుకొని ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంపిక చేశారు. విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అనుసరిస్తున్నారు చంద్రబాబు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర స్థాయి లీడర్ నుంచి క్షేత్రస్థాయిలో పని చేసే కేడర్ వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారట. అదే టైంలో కూటమి నేతలతో కూడా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. పని తీరుతోపాటు ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పోస్టుల భర్తీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ప్రక్రియను మాత్రం వారం పదిరోజుల్లో ప్రారంభించాలని చూస్తున్నారు.

Focus on filling nominated posts

 

New formula for nominated posts | నామినేటెడ్ పదవుల కోసం నయా ఫార్ములా | Eeroju news

Related posts

Leave a Comment