Fire Brand Kotam Reddy | ఫైర్ బ్రాండ్…. కోటంరెడ్డి | Eeroju news

Kotam Reddy

ఫైర్ బ్రాండ్…. కోటంరెడ్డి

నెల్లూరు, జూలై 10, (న్యూస్ పల్స్)

Fire Brand Kotam Reddy

ఉమ్మడి నెల్లూరు జిల్లా పదికి పది సీట్లు టీడీపీ పరమయ్యాయి. వైసీపీ కంచుకోటలు సైతం పేకమేడలా కూలిపోయాయి. పసుపు జెండా రెపరెపలాడింది. అసలు అవకాశమే లేదు అనుకున్న చోట ఇంతటి ఘన విజయం ఎలా దక్కింది. రాష్ట్రం మొత్తం కూటమి హవా వీచినట్లే.. నెల్లూరులోనూ సైకిల్‌ స్పీడ్‌ కొనసాగిందా? లేక ఇంకేమైనా కారణముందా? అంటే కచ్చితంగా ఓ పేరు వినిపిస్తుంది.. ఆ పేరే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. పదునైన విమర్శలతో వైసీపీ కోటలను కూల్చేసిన గ్రనేడ్‌ మన్‌ కోటంరెడ్డి. ఫ్యాన్‌ రెక్కలు విరిచి సైకిల్‌కు కొత్త జవసత్వాలు తెచ్చేలా తొలి అడుగు వేశారు కోటంరెడ్డి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి… ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శ్రీధర్‌రెడ్డి… అంతేస్థాయిలో విభేదించి ఆయనకు దూరమయ్యారు. కోటంరెడ్డి టీడీపీలో చేరినంతవరకు ఒకలా ఉండేలా జిల్లా రాజకీయాలు… ఆయన పార్టీ మారిన తర్వాత ఒక్కసారిగా మారిపోయాయి. కోటంరెడ్డితో టీడీపీలోకి మొదలైన వలసలు… ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టీడీపీ గూటికి చేరేలా చేసింది. ఇలా నెల్లూరులో టీడీపీకి కొత్త జోష్‌ తేవడంలో కోటంరెడ్డి పాత్రను ప్రముఖంగా చెబుతున్నారు పరిశీలకులు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగానే ఉండేది.

2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే.. 2019లో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది వైసిపి. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. 54 డివిజన్‌లను క్లీన్ స్వీప్ చేసింది. కాని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసిపి కంచుకోట బ్లాస్ట్ అయింది. ఈసారి అన్ని స్థానాలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి వైసీపీ కంచుకోటను తన వశం చేసుకుంది.జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతలా డ్యామేజ్ అవడానికి ప్రధాన కారణం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిదే అంటున్నారు పరిశీలకులు. వైసీపీపై ఆయన చేసిన తిరుగుబాటే ఆ పార్టీకి నష్టాన్ని కలిగించిందంటున్నారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్‌గా చెప్పే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వ్యూహచాతుర్యంతో వైసీపీని దెబ్బతీశారు.

ఫైర్ బ్రాండ్‌ లీడర్‌ అయిన కోటంరెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించేవారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి గత ఏడాది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్లిన అమరావతి రైతులను నెల్లూరులో కోటంరెడ్డి కలవడంతో మొదలైన వివాదం…. ఫోన్‌ ట్యాపింగ్‌కు దారితీయడం… చివరకు వైసీపీ నుంచి బయటకు వచ్చినంతవరకు వెళ్లింది. పార్టీ పట్ల విధేయతతో వ్యవహరించిన తనను తీవ్రంగా అవమానించడం, అనుమానించడం తట్టుకోలేని కోటంరెడ్డి కసితో పనిచేసి వైసీపీ కోటను కూల్చేశారు.

నెల్లూరు రూరల్‌ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోటంరెడ్డి 36 వేల ఓట్ల మెజారిటీ గెలవగా, ఆయన ఎఫెక్ట్‌ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ పనిచేసింది. దీంతో జిల్లాలో పది నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా రెపరెపలాడుతోందిఫోన్ టాపింగ్ ఎపిసోడ్‌తో గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన కోటంరెడ్డి… రాజకీయంగా చాలా దూకుడు చూపారు. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి రోజుకొక ట్విస్ట్‌తో వైసీపీని ముప్పుతిప్పలు పెట్టారు కోటంరెడ్డి. వైసీపీని డ్యామేజ్ చేసి తన ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. తన తిరుగుబాటుతో ప్రభుత్వ వ్యతిరేకుల్లో ధైర్యం నింపి… టీడీపీ ప్రగతికి దోహదపడ్డారు.

కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపు మయం చేసింది.కోటంరెడ్డి తర్వాత ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వంటి బలమైన నేతలు టీడీపీలో చేరడం ఆ పార్టీలో జోష్‌ నింపింది. వైసీపీ నుంచి బయటకొచ్చిన సీనియర్‌ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తాము గెలవడమే కాకుండా జిల్లాలో టీడీపీని గెలిపించడం, వైసీపీని కూకటివేళ్లతో సహా పెకిలించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

 

Kotam Reddy

 

Two big tigers in Nellore district | నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు | Eeroju news

Related posts

Leave a Comment