Fees of Private Corporate Educational Institutions | ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులూం | Eeroju news

Fees of Private Corporate Educational Institutions

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులూం

-అటకెక్కిన జీవో ఎంఎస్ నెంబర్..1
-ప్రభుత్వాలు మారిన మా తలరాతలు మారడం లేదు.
-టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కు సెలవులు లేవు ఆదివారాలు సైతం పాఠశాలకు రావాల్సిందే
-వేతనాలు పెంచరు.వేతనానికి తగ్గ పిఎఫ్,ఈఎస్ఐ ఇవ్వరు

కరీంనగర్

Fees of Private Corporate Educational Institutions

విద్యా సంవత్సరం ఆరంభం కాగానే పిల్లలు ఆటా, పాటలకు స్వస్తి చెప్పి ఇక బడికి పయనం. ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులకు పుస్తకాల మోత. తల్లిదండ్రులకు ఫీజుల వాత. ఫీజుల వడ్డింపులు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా అంటే లేదనేచెప్పాలి. బోధన బోధనేతర సిబ్బంది ఆదివారాలు సైతం పాఠశాలకు రావాల్సిందే ప్రభుత్వ సెలవు దినాల్లో పాఠశాలకు రావాల్సిందే నిబంధనల ప్రకారం వారికి ఇవ్వవలసిన సెలవులను ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవ్వకుండా నరకయాతనకు గురిచేస్తున్నారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లేక అనేక రోగాల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. మా గోడును పట్టించుకునే వారు లేరా అని ఆవేదనకు గురవుతున్నామన్నారు.

యాజమాన్యాలు పైగా ఏప్రిల్‌, మే, జూన్‌ వచ్చిందంటే చాలు ప్రయివేటు విద్యాసంస్థల ప్రకటనల జోరు. పట్టణాల్లో ఎటు వైపు తలెత్తి చూసినా విద్యా సంస్థల హోర్డింగులే. ‘మాది స్టేట్‌ ర్యాంక్‌ అంటే మాది స్టేట్‌ ర్యాంక్‌’ అని, మాకు ఇన్ని ర్యాంక్‌లు అన్ని ర్యాంక్‌లని ప్రచార హోరు తప్ప ఏఒక్క విద్యా సంస్థ తమ సంస్థలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ర్యాంకుల స్థాయి ఎంతనేది ఎవరికీ తెలియదు. దీన్ని కూడా విద్యాశాఖ నియంత్రించడం లేదంటే ఏమనుకోవాలి? పాఠశాల విద్యకు, నిర్దిష్టమైన ఫీజు విధానం లేదు. విద్యారంగ నిపుణులు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ ఒత్తిడితో ప్రయివేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విధివిధానాలపై వేసిన తిరుమలరావు కమిటీ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆయా విద్యా సంస్థలు ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులు ఏ స్థాయిలో ఉన్నాయి. వాటికి ఉన్న ప్రమాణాలు ఏమిటి? ఇప్పటికే అసాధారణంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలలో ఫీజు తగ్గింపు చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశాలు వెల్లడి కాలేదు.

పాఠశాల విద్యలో ప్రయివేటు విద్యా సంస్థలు ఫీజు స్ట్రక్చర్‌ ఎలా ఉండాలో ఉన్నంతలో శాస్త్రీయం గా విద్యాశాఖ జీఓ నెం.1లో స్పష్టంగా పేర్కొంది. ఈ జీఓను అమలు చేయకుండా తెలంగాణ సర్కార్‌ కాలయాపన చేస్తున్నది. విద్యాశాఖ జీఓ ఎంఎస్‌ నెంబర్‌1, మెమో నెంబర్.6986/ఎస్ఈ జెన్./2023, తేదీ: 31.08.2023 ప్రకారం విద్యా సంస్థలోని ప్రతీ బ్రాంచ్‌లో పాలకవర్గం ఏర్పడాలి. 8 మందితో కూడిన పాలకవర్గంలో విద్యా సంస్థ చైర్మన్ అధ్యక్షులుగా, విద్యాసంస్థ సెక్రెటరీ/ కరస్పాండెంట్‌ మేనేజర్‌ గా, ప్రిన్సిపాల్‌/ హెడ్మాస్టర్‌, బోధన సిబ్బంది వారిలో ఎంచుకున్న ప్రతినిధి ఒకరు, పేరెంట్-టీచర్స్ కమిటీ నుండి ఒకరు విద్యార్థుల తల్లిదండ్రులలో నుండి జిల్లా విద్యాధికారిచే నియమించబడిన చదువుకున్న తల్లి ఒకరు ఉండాలి.

పాలకవర్గం సంవత్సరంలో కనీసం మూడు సార్లు సమావేశం కావాలి. మొదటి సమావేశం విద్యా సంవత్సరం ప్రారంభమైన వారం రోజుల్లో జరగాలి. పాలకవర్గమే ఫీజులు నిర్ణయించాలి. ఫీజులు నిర్ణయించేటప్పుడు బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, సౌకర్యాలు, స్కూలు నిర్వహణ ఖర్చులు, స్కూలు అభివృద్ధి ఖర్చులను పరిగణంలో ఉంచుకొని ఫీజుల స్ట్రక్చర్‌ తయారు చేయాలని ఉన్నప్పటికీ దీనిపై నిర్దిష్టమైన కార్యచరణ రూపుదాల్చింది లేదు. జిల్లా కలెక్టర్‌ లేదా తాను సిఫార్సు చేసిన అధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా ఆడిట్‌ అధికారులతో కూడిన డిస్ట్రిక్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (డీఎఫ్‌ఆర్‌సీ) స్కూల్‌ గవర్నింగ్‌బాడి ప్రతిపాదించిన ఫీజు స్ట్రక్చర్‌ను, తల్లిదండ్రులు విన్నపాన్ని పరిగణలోకి తీసుకోని ఫీజులను ఫైనల్ చేయాలి.

డీఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులనే ప్రతి ప్రయివేటు స్కూల్‌ యాజమాన్యం వసూలు చేయాలి. విద్యా సంస్థ ప్రతి బ్రాంచ్‌కు సంబందించిన ఆర్థిక లావాదేవీలు నిర్దేశిత ఫారంలో సంబందిత విద్యాధికారికి ఇవ్వాలి. సెప్టెంబర్‌ 30 చివరి గడువుగా ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్‌ స్టేట్‌మెంట్‌ చార్టర్డ్‌ అకౌటేంట్‌ చేత ఆడిట్‌ చేసిన రిపోర్ట్‌ను విద్యాధికారికి ఇవ్వాలి. ఇది ఏ ఒక్క విద్యాసంస్థలోనూ అమలవ్వడం లేదు. బోధనా, బోధనేతర సిబ్బందిని ”స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ” ద్వారా నియమించాలి. పోస్టుల వివరాలు సర్క్యులేషన్‌ అధికంగా ఉన్న కనీసం రెండు తెలుగు దినపత్రికలలో ప్రకటనలివ్వాలి. పోస్టుల భర్తీకి సంబంధిత విద్యాధికారి అనుమతి తీసు కోవాలి. ఇవేవీ ఆచరణలో అమలు కావడం లేదు. ఫీజుల వసూలు, మౌలిక వసతుల కల్పనా తదితర అంశాలపై జీఓలో పేర్కొన్న విధంగా అమలు చేయాలనీ, అందుకు జిల్లా విద్యాధికారి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యా శాఖ మెమో.నం.6986/ఎస్ఈ.జెన్./2023, తేదీ: 31.08.2023 ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

విద్యార్థుల నుండి వసూలు చేసే ఫీజులలో 50శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌నకు వేతనాలు చెల్లించాలి. 15శాతం ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తదితరాలకు వినియోగించాలి. బిల్డింగ్‌ రెంట్‌, కరెంటు, వాటర్‌ బిల్లులు, లైబ్రరీ బుక్స్‌, ల్యాబ్‌, కెమికల్స్‌, ఆడిట్‌, ఆఫీసు తదితర నిర్వహణ ఖర్చులకు 15శాతం మాత్రమే వినియోగించాలి. మరొక 15శాతం స్కూల్‌ అభివృద్ధికి అదనపు రూమ్‌ల నిర్మాణం, ల్యాండ్‌ కొనుగోలు, కొత్త కోర్సులు, సెక్షన్స్‌ కోసం వినియోగించుకునే వీలుంది. స్కూల్‌ యజమాన్యం 5శాతం మాత్రమే లాభాలు తీసుకోవాలి. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ప్రస్తుతం ఉన్న వేతనాలను పెంచడానికి అవకాశం ఉన్నది. ఇంత తీవ్రంగా ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు దోపిడి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు.

పీఎఫ్‌, బోనస్‌, గ్రాట్యుటీ:- ఫీజులో 15% తో రూ.31లక్షల 50 వేల పీఎఫ్‌, బోనస్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ద సౌకర్యాలకు చెల్లించాలి. కానీ ఒక అంచనా ప్రకారం 30 నుండి 35శాతం మాత్రమే వేతనాలు, సౌకర్యాల కోసం చెల్లిస్తున్నారు. సంవత్సరంలో 12నెలలకు వేతనాలు చెల్లించ వలసి ఉండగా, చాలా యాజమాన్యాలు పది నెలలకు మాత్రమే వేతనాలు ఇస్తున్నాయి.

ఫీజులలో స్కూల్‌ యజమాన్యం 5శాతం మాత్రమే లాభాలు పొందాలి. కానీ కొన్ని స్కూల్‌ యాజమాన్యాలు ప్రతీ సంవత్సరం 30 నుండి 40శాతం లాభాలు గడిస్తూ విద్యాసంస్థల యాజమాన్యం తెలంగాణ వ్యాప్తంగా 50 నుండి 60 బ్రాంచీలు ప్రారంభించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
ట్యూషన్‌ ఫీజు సంవత్సరానికి లక్ష, ఆపైన వసూలు చేస్తున్న రిజిస్ట్రేషన్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు, డెవలప్‌మెంట్‌ ఫీజు, వ్యాన్‌ ఫీజు, యూనిఫాం, షూస్‌, పుస్తకాల ఖర్చులు తడిసి మోపెడవు తున్నాయి.

ఎంత ఎక్కువ డబ్బులు స్కూల్‌ ఫీజులకు చెల్లిస్తే అంత గొప్ప చదువును తమ పిల్లలకు చదివిస్తున్నట్లు భావిస్తున్న మధ్య తరగత మనస్తత్వాన్ని విద్యాసంస్థలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. విద్యను మంచి లాభసాటి వ్యాపారంగా భావిస్తున్న పలు సంస్థలు క్వాలిఫైడ్‌ టీచర్స్‌ ను నియమించడం లేదు. మరి కొన్ని సంస్థలు తమ ఫ్యాకల్టీకి లక్షల్లో వేతనం ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యారంగ నిపుణులు, ప్రభుత్వ శాఖలు నిర్దేశించిన కాలిఫైడ్‌ ఫ్యాకల్టీ కావాలి కానీ, లక్షల్లో వేతనం ఇస్తే మాత్రం విద్యార్థులకు అదనంగా బోధించేదే ముంటుంది?

బోధన పద్ధతితోపాటు విద్యార్థుల గ్రహణశక్తి చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. గ్రహణశక్తి పెంపొంద డానికి ఆహారం, ఆరోగ్యం, గాలి, వెలుతురు, శబ్దం, పరిసరాల తోపాటు సామాజిక ప్రభావం కూడా ఉంటుంది. ఇవేమీ మార్చకుండా భవి భారత పౌరులను యంత్రాలు గా మార్చడం వలన ప్రయోజనం శూన్యం. హైదరాబాద్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు పోరాటాలు చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన విద్యా సంస్థలలో ఫీజులను పెంచకుండా నిరోధించే ప్రయత్నం కూడా చేశారు. అందరూ ఆదిశగా ఆలోచించి అడుగేస్తే విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణపై ప్రభుత్వంపై ఒత్తిగి పెరిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

Fees of Private Corporate Educational Institutions

 

ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్ | Seize unauthorized books in private school | Eeroju news

Related posts

Leave a Comment