నీరు ఏదీ… నాట్లు ఎక్కడ…
కాకినాడ, జూన్ 29, (న్యూస్ పల్స్)
Farmers are worried about the lack of irrigation water or crops
రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి ముందే రాష్ట్రాలలోకి ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగా పడటం లేదు. జూన్, జులై నెలలో కూడా ఇలాగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుఫానులు వస్తే తప్ప భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవన్నది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇది అన్నదాతలకు ఆందోళనకు కలిగించే విషయం. ప్రాజెక్టులకు నీరు వచ్చి చేరడం లేదు. సాగుచేద్దామంటే ధైర్యంచాలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పడు తలెత్తాయని రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఆవేదన చెందుతున్నారునిజానికి ఏటా జూన్, జులై నాటికి భారీ వర్షాలు కురిసి జలకళను ప్రాజెక్టులు సంతరించుకుంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల కింద సాగయ్యే లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందాలంటే భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాల్సిందే. కొన్ని సార్లు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం ప్రకృతి కోపించిందనే అనుకోవాలి.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులలో నీరు తగినంతగా లేకపోవడంతో సాగు నీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జులై నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అందుకోసం దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో నీరులేకపోవడంతో అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నలభై ఏళ్లలో కృష్ణా నదిలో ఇంత తక్కువ నీరు ఎప్పుడూ లేదంటున్నారు. నీరు ఈ ఏడాది అందడం కష్టమేనని చెబుతున్నారు. ఆగస్టు నెల నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ అప్పటికి ఏంజరుగుతుందోనన్న టెన్షన్ రైతుల్లో ఉంది. దుక్కులు దున్ని నాట్లు వేసుకుంటే నష్ట పోతామని ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో సమయానికి నీరు అందుతుందా? లేదా? అన్న టెన్షన్ మొదలయింది. అదే సమయంలో వర్షాలు కూడా చిరుజల్లులు పడి వెళుతున్నాయి. ఇది తమకు ఎంత మేరకు ఉపయోగపడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిస్తే తప్ప జలాశయాలు నిండవు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితేనే కింద ఉన్న జలాశయాలకు నీరు చేరదు. మరి ఈ ఏడాది సాగు పై అనుమానపు మేఘాలు అలుముకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తన రెండో కేబినెట్ లో రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకుంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తొలి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపైనే సంతకం చేశారు. ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకున్నారు. 14 రకాల పంటలకు… వరి, రాగి, మొక్కజొన్న, పత్తితో సహా పథ్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తసీుకున్నారు. దీంతో క్వింటా వరి ధర 2,300 రూపాయలకు చేరింది. పంటల ఉత్పత్తి కన్నా 1.5 రెట్లు కనీస మద్దతు ధరను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నూనెగింజలు, పప్పు ధాన్యాలకు కూడా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.