ఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు
హైదరాబాద్, జూలై 24 (న్యూస్ పల్స్)
Elevated Corridor
హెచ్‌ఎండీఏ రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో ఒకటి ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, మరొకటి ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఉన్నాయి. కాగా, బల్దియాలో కంటోన్మెంట్ విలీనం, ఎలివేటెడ్ కారిడార్లకు భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలుపడంతో… ఎట్టకేలకు ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ అడుగు పడింది. అయితే హెచ్‌ఎండీఏ పూర్తి స్థాయి ఎలివేటెడ్ కారిడార్ లేదా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టుకు వీలుగా ఉండేలా… డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గాను, ఎలివేటెడ్ కమ్ అండర్ గ్రౌండ్ టన్నెల్ విధానంలో ప్రాజెక్టులను నిర్మించేలా ప్రతిపాదనలు చేస్తోంది.
అయితే ఈ మార్గంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ సాధ్యమేనా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు 18కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను ఆరు లైన్లతో నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 192 ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇందులో 113 ఎకరాల వరకు డిఫెన్స్ భూములు, 83 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి.
అలాగే సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ నుంచి కొంపల్లి అవతల ఉన్న డెయిరీ ఫాం వరకు ఆరు లైన్లలో మరో ఎలివేటెడ్ కారిడార్ చేపట్టనున్నారు. ఇందులో 18 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు బేగంపేట విమానాశ్రయం పెద్ద అడ్డంకిగా మారేలా ఉంది.
బేగంపేట ఎయిర్‌పోర్టు హద్దులు ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అసాధ్యంగా మారుతున్నది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో భవనాలు, నిర్మాణాల ఎత్తుపై పరిమితులు ఉంటాయి. దీంతో ఎయిర్‌పోర్టు వర్గాలు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో పలు సూచనలు, మార్పులు చేసే అవకాశం ఉన్నదని తెలిసింది.