Tirupati : స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు

Sports politics in AP

 . స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు

– టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు

తిరుపతి,
టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. టిటిడి ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారుకావాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. టిటిడి ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి మాన‌సిక వికాసం కోసం 1977వ సంవ‌త్స‌రం నుండి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉద్యోగుల‌కు క్రీడాపోటీలు నిర్వ‌హించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు శుక్ర‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ప‌రేడ్ మైదానంలో ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు ఉద్యోగుల‌తో క్రీడాప్ర‌తిజ్ఞ చేయించారు. ముందుగా ఛైర్మ‌న్‌, ఈవో, అదనపు ఈవో, జేఈవో క‌లిసి క్రీడాప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. బెలూన్లు, శాంతి క‌పోతాల‌ను ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు ఉద్యోగులు విశేషసేవలు అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని, వాటిని నియంత్రించడం క్రీడల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. టిటిడి ఉద్యోగులు సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతీ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమిని విజయవంతం చేశారని అభినందించారు. టిటిడి ఉద్యోగులలో క్రీడా స్పూర్తి, స్నేహపూర్వక వాతావరణం, సమిష్టి కృషి, మనోదైర్యం కోసం క్రీడలు చాలా ఉపయోగపడతాయన్నారు. ప్రతి రోజు ఉద్యోగులు క్రీడలలో భాగస్వాములు కావడం మూలంగా వారిలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీల్లో మొద‌టి స్థానం గెలుచుకున్న వారికి రూ.2వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1800/-, మూడో స్థానంలో నిలిచిన‌వారికి రూ.1600/- విలువగ‌ల బ్యాంకు గిఫ్ట్‌కార్డులు బ‌హుమ‌తులు అంద‌జేస్తామ‌న్నారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృత్తిలో మెరుగైన, ఉత్పాదక సేవలు అందించాలని కోరారు. గ్రీకుల కాలం నుండి క్రీడలకు ప్రాముఖ్యత ఉందన్నారు. దేశ విదేశాల్లో క్రీడలు భాగంగా ఉన్నాయన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. క్రీడ‌ల‌తో శారీర‌క దారుఢ్యంతోపాటు పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని చెప్పారు. టిటిడిలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లను నియంత్రించుకుని, భావోద్వేకానికి గురికాకుండా క్రీడా స్పూర్తితో భక్తులకు మరింతగా సేవలు అందించాలని సూచించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో, అదనపు ఈవో, జేఈవో క్రీడ‌ల‌ను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ హైస్కూల్ ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానాలలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు.

Read : eeroju.co.in/congress-route-map-on-jobs-ఉద్యోగాలపై-కాంగ్రెస

Related posts

Leave a Comment