రుషికొండ రహస్యాలపై అనుమానాలు
విశాఖపట్టణం, జూన్ 22, (న్యూస్ పల్స్)
Doubts on the secrets of Rushikonda : విశాఖ పర్యాటక కేంద్రం. రుషికొండ అందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 2019లో వైసీసీ అధికారంలోకి వచ్చే ముందు వరకు రుషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. పాత గదులు 34, కొత్త గదులు 24 కలిపి మొత్తం 58 గదులు ఉండేవి. పర్యాటకులు ఆన్లైన్లో గదులు బుక్ చేసుకుని అక్కడ బస చేసే వారు. రెస్టారెంట్, సమావేశ మందిరాలు ఉండేవి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వచ్చినట్టే.. రుషికొండకు కూడా పర్యాటకులు స్వేచ్ఛగా వచ్చి వెళ్లిపోయే వారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
మూడు రాజధానుల అంశం, విశాఖ పరిపారాలనా రాజధాని అన్న విషయం తెరపైకి వచ్చిన కొన్ని రోజులకే రుషికొండ నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. పర్యాటకులే కాదు.. స్థానికులు కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముందుగా 20 అడుగుల ప్రహరీ గోడ పైకి లేచింది. తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వలేదు. అక్కడ ఏదో జరుగుతోందని తెలుసు కానీ.. ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. రుషికొండ రహస్యం నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రతిపక్షనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
పవన్కల్యాణ్ను విశాఖ దాటి వెళ్లనివ్వలేదు. లోకేశ్, కమ్యూనిస్టు నేతలు ఇలా ఎవరూ రుషికొండ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారునేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా కొండను తొలచి నిర్మాణాలు చేపడుతున్నారని… దీనివల్ల మొత్తం రుషికొండకే ప్రమాదం ఏర్పడుతుందని ప్రతిపక్షాలు, పర్యావరణ వేత్తల తరఫున న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. పర్యాటక భవనం పేరుతో దరఖాస్తులు చేసుకుని మరేవో నిర్మాణాలు చేపట్టారన్న మూకుమ్మడి ఆరోపణలు వినిపించాయి. గండికోట రహస్యం తరహాలో… ఇలా నాలుగేళ్లపాటు రుషికొండ రహస్యం సాగింది. ఇంకొన్నేళ్లూ ఆ రహస్యం అలాగే ఉండేదేమో కానీ…ఇంతలో ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారిపోయింది.భీమిలి ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు… మరికొందరిని తీసుకుని రుషికొండ రాజప్రాసాదంలో అడుగుపెట్టడంతో అసలు కథ బయటికొచ్చింది. నాలుగేళ్లపాటు సాధారణ జనం మొదలుకుని, రాజకీయ నేతల దాకా ఎవరినీ రుషికొండ వైపు కన్నెత్తి చూడనీకుండా అప్పటి ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందో.. రుషికొండకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ రహస్యంగా ఉంచడానికి కారణమేంటో…రుషికొండను తొలచి ఏం చేశారో అందరికీ తెలిసిపోయింది.
కొండ చుట్టూ ఏడు సూపర్ స్ట్రక్చర్స్, సీ వ్యూ క్యాప్చర్.. ఆ భవనాల లోపల విదేశాల నుంచి తెప్పించిన ఇంటీరియర్ ఫర్నీచర్, యూరప్ నుంచి తెప్పించిన గ్రానైట్, ప్రత్యేక డిజైన్ మార్బుల్, బయోమెట్రిక్తో పనిచేసే వార్డ్రోబ్స్, 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూమ్లు, ఎటువైపు నుంచి చూసినా సముద్రం కనిపించేలా డిజైన్, గోడలపై పాలరాయి తాపడాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, విదేశాల నుంచి తెప్పించిన మంచం, పరుపు, కుర్చీలు, బల్లలు, భవనాల బయట విదేశాల నుంచి తీసుకొచ్చిన వేల మొక్కలతో ఏర్పాటు చేసిన గార్డెన్, ఆ గార్డెన్లో 20 కోట్ల ఖర్చుతో చేసిన విద్యుత్ అలంకరణలు, రెండున్నర లక్షలతో ఏర్పాటైన్ ఒక్కో విద్యుత్ దీపం…. ఇలా రుషికొండపై ఉన్న నిర్మాణాల ధగధగలు గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ ఏడు బ్లాకుల్లో ఓ భవనంలోని బాత్ టబ్, స్పా, బంగారం రంగులో ఉన్న కమోడ్ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
జగన్ తన కోసం, తన కుటుంబం కోసం నిర్మించుకున్నారని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఓ భవనంలో ఇవి ఉన్నాయి. బాత్ టబ్ ఖరీదు 26 లక్షలని, బంగారం రంగులో ఉన్న కమోడ్ ధర 15 లక్షలని ప్రభుత్వం అంటోంది.హరిత రిసార్ట్స్ ఆధ్వర్యంలో నడిచే రూమ్లను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు కొండపై కొత్త భవనాలు నిర్మించారు. కొత్త నిర్మాణాల్లో నిబంధనలు పాటించలేదని టీడీపీ ఆరోపిస్తోంది. పాత భవనాల ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తం 9.88 ఎకరాల్లో విజయనగర, కళింగ, వేంగి, గజపతి బ్లాకులుగా భవనాల నిర్మాణం జరిగింది. విజయనగర బ్లాకునే మూడుగా విభజించారు. వాటికి చోళ, పల్లవి, తూర్పు కనుమలుగా పేర్లు పెట్టారు.
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈ ఆధునికీకరణ కార్యక్రమాలు సాగాయి. రిసార్టులను ఆధునికీకరించే పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు.గంటా శ్రీనివాసరావు ఆ భవనాల వీడియోలు విడుదల చేసేవరకు.. ఆంధ్రప్రదేశ్లో అంత విలాస భవనాలు ఉన్న విషయమే బయటకు రాలేదు. 400మందితో సమావేశం జరుపుకోగల మీటింగ్ రూం, 100 మందితో సమావేశాలకు సరిపోయే నాలుగు రూమ్స్ ఉన్నాయి. ఏడు బ్లాకులుగా ఉన్న మూడు భవనాలు అత్యాధునిక హంగులతో ఉన్నాయి.
Doubts on the secrets of Rushikonda :
ఖరీదైన ఫర్నీచర్, షాండ్లియర్లు, బంగార రంగు షవర్లు, కుళాయిలు, టీవీలు, అధునాతన డిజైన్లలో ఫ్యాన్లు, బిగ్స్క్రీన్లు, ఖరీదైన కుర్చీలు, విలాసవంతమైన పడకగదులు ఇలా రుషికొండ రాజభవనాల ప్రత్యేకతల గురించి, ఆ స్థాయిలో ఆ భవనాలను తీర్చిదిద్దడానికి అయిన ఖర్చు గురించి ఎంత చెప్పినా తక్కువే.రుషికొండ ప్యాలెస్లో వాడిన ఇటాలియన్ మార్బుల్, టైల్స్ చూస్తే దిమ్మ తిరుగుతుందని, ఈ ఇటాలియన్ మార్బుల్ కోసం ఒక్కో అడుగుకు పెట్టిన ఖర్చుతో మధ్యతరగతి ప్రజలు చిన్న సైజు అపార్ట్మెంట్ కొనేయొచ్చని టీడీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే విభజన బాధిత రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి పెద్దల కోసం, పర్యాటకుల కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టి భవనాలు నిర్మించే స్థితిలో ఉండడమే అసలైన విచిత్రం.