ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం
శ్రీకాకుళం, ఆగస్టు 2 (న్యూస్ పల్స్)
Dharmana Brothers
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ధర్మాన సోదరులు పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. మొదట ధర్మాన కృష్ణదాసు.. తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరూ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కారణంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్ తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు.
ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాసు కంటే సీనియర్. ఆయన 1989లో మొదటి సారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా నాలుగు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా పేరు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ పయనం గందరగోళంగా మారింది. ఆయన కంటే ముందే ఆయన సోదరుడు కృష్ణదాస్ జగన్ వెంట నడిచారు. దాంతో ఆయనకే వైసీపీలో ప్రాధాన్యం లభించింది. ఆ తర్వాత మరో ఆప్షన్ లేకపోవడంతో ధర్మాన కూడా వైసీపీలో చేరారు. శ్రీకాకుళం నుంచి ఓ సారి గెలిచి రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు.
నిజానికి ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. తన వారసుడికి అవకాశం ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి తెచ్చారు.కానీ జగన్ మాత్రం ధర్మాన ప్రసాదరావునే పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. చివరికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే తాను పోటీ చేయలేను అన్నానని జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చేవారు. ఇది ప్లస్ అయిందో.. మైనస్ అయిందో కానీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ధర్మాన కృష్ణదాసు కూడా తన వారసుడ్ని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నారు.
కానీ అవకాశం లభించలేదు. టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీకి ఇక భవిష్యత్ ఉంటుందా లేదా అన్న అనుమానం సిక్కోలు వైసీపీ నేతల్లో ప్రారంభమయింది. దానికి కారణం భారీగా వచ్చిన మెజార్టీలే. సంక్షేమ పథకాల ప్రభావం అసలేమీ లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే రాజకీయ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. కుదిరితే తమ వారసుల్ని టీడీపీ లేదా జనసేనల్లోకి పంపించడం మంచిదని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లో ఒక్క దువ్వాడ శ్రీనివాస్ తప్ప ఎవరూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు.
YCP is empty in the kuppam | కుప్పంలో వైసీపీ ఖాళీ | Eeroju news