Denial of permission to medical colleges | మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ | Eeroju news

medical colleges

మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్, జూలై 11  (న్యూస్ పల్స్)

Denial of permission to medical colleges

రేవంత్ రెడ్డి సర్కారుకు నేషనల్ మెడికల్ కమిషన్  షాకిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానున గద్వాల, మెదక్, ములుగు, షాద్‌నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించాలని కోరింది. అయితే, అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతిచ్చేందుకు ఎన్‌ఎంసీ నిరాకరించింది.

నిబంధనల ప్రకారం.. కొత్తగా 50 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. అంటే మొత్తంగా 59 మంది బోధన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ కొత్త 8 కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు తప్ప మిగతా సిబ్బంది నియామకం జరగలేదు. ఇటీవల ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు వచ్చింది. ఈ సందర్భంగా అసలు ఫ్యాకల్టీ లేకపోవడంపై ఎంఏఆర్బీ( తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఆయా కళాశాలల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ.. ప్రిన్సిపాళ్లకు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో అవుట్‌ పేషంట్స్‌, ఇన్‌పేషంట్స్‌పై కూడా ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను వైద్యారోగ్యశాఖ 60 రోజుల్లోగా సవరించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనుమతులు మంజూరుచేయరు. అయితే ఈ లోగా కొత్త కాలేజీలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తికావటం అనేది అనుమానమే. ఇటీవల అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారిని కేటాయించినా.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్ల నియమాక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎపుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతులపై శ్రద్ధ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ మొదటి నుంచీ వైద్యారోగ్యశాఖకు గుర్తు చేస్తున్నా పట్టించుకోలేదు. మెడికల్ కాలేజీల అననుమతి అంశాన్ని పునఃపరిశీలించాలని ఎన్‌ఎంసీని కోరాలని డీఎంఈ నిర్ణయించింది. మరోసారి దరఖాస్తు చేసేందుకూ కసరత్తు చేస్తోంది. కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం నుంచే అన్ని విభాగాలు, అనుబంధ బోధనాసుపత్రి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఎన్‌ఎంసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.

ఈ విషయమై డీఎంఈ ఉన్నతాధికారులు మాట్లాడుతూ…. షాద్‌నగర్, కుత్బుల్లాపూర్ మినహా మిగిలిన ఆరింటికి అనుమతులు వస్తాయని భావించాం. భవనాల సమస్య లేకున్నా కొన్నిచోట్ల అనుబంధ ఆసుపత్రులు, సిబ్బందిపై ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతుండగానే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతులు ఇచ్చాం. తాజా బదిలీల్లోనూ కొత్త వైద్య కళాశాలల్లోని పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నాం.

తనిఖీల సమయంలో లేని సదుపాయాలను తర్వాత సమకూర్చాం. అందుకే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎన్‌ఎంసీని కోరుతామని డీఎంఈ అధికారులు అంటున్నారు. 8 కాలేజీల్లో కనీసం కొన్నింటినైనా ఈ ఏడాది ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్లు డీఎంఈ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని.. అన్ని అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు వివరించారు.

 

medical colleges

 

ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు | Actions are taken to have sports period and library for students every day in schools | Eeroju news

Related posts

Leave a Comment