తిరుమల తిరుపతి దేవస్థానంలో దళారీ వ్యవస్థ
తిరుపతి, జూలై 1, (న్యూస్ పల్స్)
TTD : Dalari system in Tirumala Tirupati Devasthanam
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశనలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దళారీలు మోసాలకు పాల్పడుతున్నాయి. తిరుమలలో దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు టీటీడీ కసరత్తు చేస్తుంది. టీటీడీ ఆన్ లైన్ అప్లికేషన్లను ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తుంది. శ్రీవారి దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ, ఇతర సేవలను భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు టీటీడీ వీలు కల్పిస్తుంది. టీటీడీ వెబ్సైట్లో దళారీ బెడదను నియంత్రించేందుకు ఆధార్ లింక్ చేసే సాధ్యాసాధ్యాలపై టీటీడీ పరిశీలిస్తుంది. అప్లికేషన్లకు ఆధార్ లింకు చేసే అంశాలపై UIDAI అధికారులు టీటీడీకి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
టీటీడీ ఈవో జె.శ్యామలరావు దళారీ వ్యవస్థను నియంత్రించే అంశమై యూఐడీఏఐ అధికారులతో చర్చించారు. దళారుల బెడద తప్పించేందుకు టీటీడీ అప్లికేషన్లను ఆధార్ తో లింక్ చేసే విషయమై దృష్టిసారించారు. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఐటీ విభాగం అధికారులను ఈవో ఆదేశించారు. ఆధార్ ద్వారా భక్తుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్తో పాటుగా ఆధార్ డూప్లికేషన్ ఎలా కనిపెట్టాలో UIDAI అధికారులతో టీటీడీ ఈవో చర్చించారు.తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా, నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఈవో కార్యాలయంలో టీటీడీ అధికారులు, డెయిరీ నిపుణులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ… నాణ్యమైన నెయ్యి కొనుగోలు, కొనుగోలు చేసిన నెయ్యిని ప్రస్తుతం పరీక్షిస్తున్న విధంగా కాకుండా మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలా పరీక్షించాలనే అంశాలపై చర్చించారు. ప్రముఖ డెయిరీ నిపుణులు విజయభాస్కర్ రెడ్డి, సురేంద్రనాథ్ లడ్డు నాణ్యత పెంచేందుకు ఎస్ఎస్ఐ నిబంధనల ప్రకారం నెయ్యి తయారీ, అగ్ మార్క, ఫుడ్ సేఫ్టీ అథారిటీ, టీటీడీ నిబంధనల ప్రకారం నెయ్యి నాణ్యత ఎలా ఉండాలనేదానిపై ప్రజెంటేషన్ వివరించారు. లడ్డు నాణ్యత మరింత పెంచడానికి అవసరమైన నెయ్యి కోసం సమగ్ర నివేదిక ఇవ్వాలనీ ఈవో ఆదేశించారు.తిరుమల వచ్చే భక్తులకు దుకాణదారులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై టీటీడీ ఈవో శ్యామలరావు ఇటీవల స్పందించారు.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసి భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో జె శ్యామల రావు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. శ్రీనివాసమంగాపురం, శ్రీవారి మెట్టు మార్గంలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు… జేఈఓ (విద్యా, వైద్యం) గౌతమి పర్యవేక్షణలో టీటీడీ ఎస్టేట్ అధికారి గుణ భూషణ్ రెడ్డి శ్రీవారి మెట్టు వద్ద ఉన్న మూడు షాపులను తనిఖీ చేశారు. ఇందులో షాప్ నంబర్-3లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాప్ నెంబర్ -3 యాజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రూ.25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని టీటీడీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.