ఐఏఎస్ అధికారుల బదిలీలలో తిరకాసు
విజయవాడ, జూన్ 25, (న్యూస్ పల్స్)
Controversy in transfers of IAS officers:
ఏపీలో జరుగుతున్న ఐఏఎస్ బదిలీలు అధికార వర్గాల్లో చర్చగా మారాయి. మునుపెన్నడు లేని విధంగా గతంలో వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర పడిన ఐఏఎస్లకు కీలక పోస్టింగులు దక్కడంపై అధికార పార్టీ వర్గాల్లో కూడా చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేది, సాయిప్రసాద్, ప్రద్యుమ్న వంటి అధికారులకు పోస్టింగులు ఇవ్వడంపై ఇప్పటికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ద్వివేది శాఖను ఇప్పటికే మార్చారు.తాజాగా జిల్లా కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్ అధికారులకు దక్కుతున్న పోస్టింగులపై బ్యూరోక్రాట్లలో నిరసన వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా రాజకీయ కారణాలతో కీలక పోస్టింగులు దక్కించుకున్న వారిలో కొందరికి కొత్త ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత దక్కడంపై నిరసన వ్యక్తమవుతోంది.
బ్యూరోక్రాట్ వర్గాలతో పాటు అధికార వర్గాల్లో సైతం చర్చనీయాంశంగా మారంది.రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు కలెక్టర్లను జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించగా సృజనకు మాత్రం కీలకమైన ఎన్టీఆర్ జిల్లాలో బాధ్యతలు అప్పగించడం ఏమిటనే చర్చ జరుగుతోంది. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన అధికారుల్లో గుంటూరు కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, విశాఖ కలెక్టర్ మల్లికార్జున్, అల్లూరి జిల్లా కలెక్టర్ విజయసునీత, కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఉన్నారు.పాత కలెక్టర్లలో తిరిగి పోస్టింగులు దక్కిన వారిలో విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మీ, చిత్తూరు కలెక్టర్ షన్మోహన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పశ్చిమ గోదావరి కలెక్టర్ సుమిత్ కుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కర్నూలు కలెక్టర్ సృజన ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమితులైన గుమ్మళ్ల సృజన నియామకంపై అధికారుల్లో చర్చగా మారింది. గుమ్మళ్ల సృజన తండ్రి బలరామయ్య ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఆమె భర్త రవితేజ హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. గతంలో సమైక్య రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లిన సృజనకు గత ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.2013బ్యాచ్కు చెందిన సృజన రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లాలో సబ్ కలెక్టర్గా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆమెకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారు.అప్పట్లో ఉత్తరాంధ్రను తన కనుసన్నల్లో శాసించిన వైసీపీ ముఖ్యనాయకుడికి సృజన ఆశీస్సులు ఉండటంతోనే విశాఖపట్నం బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ పోస్టింగ్ వ్యవహారంలో సదరు నాయకుడికి ఢిల్లీలో టైపిస్ట్ తరహాలో పనిచేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా తెర వెనుక చక్రం తిప్పినట్టు తెలుస్తోందిసదరు అధికారి… ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ రావడానికి ముందు ఢిల్లీలో అధికార పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో కొన్ని నెలల పాటు అధికారిక లేఖలు రాసే ఉద్యోగాన్ని అనధికారికంగా నిర్వర్తించారు. ఆ తర్వాత ఏపీలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆ అధికారిక చొరవతో పెద్దగా అనుభవం లేకపోయినా విశాఖపట్నం కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించినట్టు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించిన సమయంలో దేశంలో ప్రధాన నగరాల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు అధికారిక హోదాలో హాజరైనా, ఆమెతో పాటు కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి.
జివిఎంసి కమిషనర్గా పనిచేసిన సమయంలో ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నివాసం వద్ద రోడ్డు విస్తరణ చేపట్టడం, దివంగత ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద ఆక్రమణల పేరుతో కూల్చివేతలు, వైసీపీ ఒత్తిళ్లతో ట్రాఫిక్ సిగ్నల్ మార్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.విశాఖపట్నం పోస్టింగ్ తర్వాత ఆమెకు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా తనదైన ముద్ర వేయకపోయినా తిరిగి కీలకమైన ఎన్టీఆర్ జిల్లాలో పోస్టింట్ ఇవ్వడం వెనుక ఏమి జరిగిందనే చర్చ జరుగుతోంది.కర్నూలు జిల్లాలో కూడా కలెక్టర్గా పెద్దగా ప్రభావం చూపలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి గుమ్మనూరు జయరాం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారని ఆ జిల్లాకు చెందిన నాయకులు చెబుతారు.
ప్రత్యేకించి ఎవరికి అనుకూలంగా వ్యవహరించకపోయినా విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించరనే ముద్ర వేసుకున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన ఓ మైనార్టీ నాయకుడి చెప్పు చేతల్లో పనిచేశారనే అపవాదు ఉంది. కింది స్థాయి అధికారులను అందరి ముందు దూషించడం, మందలించడం ద్వారా ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల జోక్యం చేసుకుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి.ఐఏఎస్ అధికారుల బదిలీలు తలనొప్పిగా మారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నియామకంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వివాదాస్పద అధికారుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి గురించి సమగ్ర నివేదికలు అందిన తర్వాతే పోస్టింగులు ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.