ఏపీలో కాంగ్రెస్ వైఎస్సాఆర్ అస్త్రం
గుంటూరు, జూలై 9, (న్యూస్ పల్స్)
Congress YSR astram in AP
వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించారు. అటు ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తల్లి విజయమ్మతో కలిసి నివాళి అర్పించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణలోనూ వైఎస్ఆర్ 75వ జయంతి సంబరాలు ఘనంగా, అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో నిర్వహించడమే కాకుండా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందడంతో వారు హాజరయ్యారు.
అలాగే కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఎలాగైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీకు పూర్వవైభవం తీసుకువచ్చి సౌత్ ఇండియాలో అటు ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.దీనిని ఊతం ఇచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో సంచలన ట్వీట్ చేశారు. తనకు వైఎస్ఆర్ స్పూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను వైఎస్ షర్మిల నెరవేర్చగలరని ధీమాను వ్యక్తం చేశారు. అదే క్రమంలో సోనియా గాంధీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అలాంటి పటిష్టమైన నాయకత్వ లక్షణాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల అయితేనే ఏపీలో రాణించగలరని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కీలక భేటీకి వేదికైంది ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి.
ఇప్పటికే దేశంలో ఎన్డీయే సర్కార్ కొలువు దీరినప్పటికీ ఇండియా కూటమి కూడా ధీటైన సీట్లతో గట్టిపోటీ ఇచ్చింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది కాంగ్రెస్. దేశంలో ప్రతిపక్షపాత్రను పోషిస్తోంది.ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో బంపర్ మెజార్టీ సాధించింది. అటు మొన్నటి వరకూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. దీంతో అసెంబ్లీలో ప్రజల తరఫున బలమైన స్వరం వినిపించేందుకు అవకాశం కూడా లేదని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇలాంటి తరుణంలో ఏపీలో కాంగ్రెస్ ప్రత్యమ్నాయం అని చెప్పుకునేందుకు సరైన అవకాశం వచ్చిందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
అందులో భాగంగానే ఈ కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉంటూ, బలమైన క్యాడర్ ను తయారు చేసుకుంటూ 2029 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ వైఎస్ షర్మిలకు మద్దతుగా ఉన్నారని తెలపడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఎలాగైనా వచ్చే ఐదేళ్లలోపూ పార్టీని, క్యాడర్ ను పుంజుకునేలా చేసి ధీటైన నేతలను ఎంపిక చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేవీపీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక కాంగ్రెస్ ప్రత్యమ్నాయంగా మారితే వైఎస్ఆర్ ఓటు బ్యాంకు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోని షర్మిల వైపుకు తిరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. దానికి అనుగుణంగానే పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న కూటమి ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు సాగితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తదు. అది ఏ మాత్రం అసంతృప్తి ప్రజల్లో కనబరిచినా.. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. అప్పుడు ప్రత్యమ్నాయంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు పార్టీలు బలంగా మారే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జరిగే ఈ కీలక సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Vijayamma on Congress stage | కాంగ్రెస్ వేదికపై విజయమ్మ… | Eeroju news