ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా | Congress will not recover in AP | Eeroju news

కడప, జూన్ 12, (న్యూస్ పల్స్)

వైఎస్ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయి నవ్వుల పాలయ్యారు. ఆమె ఈ ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు కానీ.. కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ ను పెట్టేశారనే అనాలి. గెలుస్తానన్న విశ్వాసమో.. లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకుని పీసీసీ చీఫ్ గా ఉండి ఓటమి పాలు కావడంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె మరో హిస్టరీకి కుటుంబ పరంగా క్రియేట్ చేశారు..కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో జరిగిన 175 స్థానాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో 5,80,613 ఓట్లు వచ్చాయి.

కేవలం 1.72 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఉన్న పార్టీకి కేవలం అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడం అంటే.. ఆ పార్టీకి ఇక సమీపంలో రాజకీయ భవిష్యత్ లేదనే చెప్పాలి. ఒకవేళ వైసీపీ అతి తక్కువ స్థానాలు రావడంతో జగన్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓట్ల షేర్ చూసి ఎవరూ ఆ పార్టీలోకి వచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితిని కొని తెచ్చుకోలేరు. అందుకే రానున్న కాలంలో వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్ గా పర్యటన చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా ఏం చెప్పుకుని వెళతారన్న ప్రశ్న వెంటనే వస్తుంది.. అయితే వైఎస్ షర్మిల ఒకటైతే సాధించగలిగారు.

తన సొంత సోదరుడు వైఎస్ జగన్ పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైనా విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంత వరకూ జగన్ ను డ్యామేజీ చేయగలిగారు. జగన్ కు సొంత ఇంట్లోనే శత్రువులున్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒకరకంగా మహిళ ఓటర్లపై కూడా పడిందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజికవర్గం ఓటర్లకు గండి కొట్టడంలో సక్సెస్ కాగలిగారు.

కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య బాగా పనిచేసిందని అంటున్నారు. కడప పార్లమెంటులో అవినాష్ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని చెబుతున్నారు. తొలుత తెలంగాణలో పార్టీనిపెట్టి తర్వాత అక్కడికే పరిమితం అవుతారనుకుంటే.. జగన్ ను అరెస్ట్ చేయించిన పార్టీకి అధిపతిగా మారారు. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్ గాంధీని కడపకు రప్పించంతో అక్కడ జగన్ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజీ అయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇంతకీ వైఎస్ షర్మిల సాధించిందేమిటి అంటే ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. అన్న జగన్ ఓటమికి ఒక కారణంగా మాత్రం ఆమె ఈ ఎన్నికల్లో పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆమెకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. కానీ అన్నపై పగ చల్లారిందా? లేక కొనసాగుతుందా? అన్నది పక్కన పెడితే తాను ఓడిపోయి.. సోదరుడిని ఓడించి..తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుకు, ప్రతిష్టకు చెడ్డపేరు తెచ్చారన్న అప్రదిష్టను మాత్రం మూటగట్టుకున్నారు. అదీ షర్మిల సాధించింది. అంతకు మించి మరొకటి లేదు.

Related posts

Leave a Comment