CM Revanth Reddy | మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర | Eeroju news

మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర

మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర

హైదరాబాద్, నవంబర్ 5, (న్యూస్ పల్స్)

CM Revanth Reddy

మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రకు స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు.ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశలో వడివడిగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునట్లే కనిపిస్తోంది. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు.

ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం యాదాద్రి పర్యటన అధికారికంగా ఖరారైంది. యాదాద్రి సందర్శన తర్వాత వలిగొండ నుంచి రామన్నపేట మండలాల పరిధిలో మూసీ పరీవాహక ప్రాంతాల గుండా సీఎం రేవంత్ రెడ్డితో పాదయాత్ర చేయించే పనిలో ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు సీఎం యాదాద్రి పర్యటన నేపథ్యలో ఈ జిల్లాలో పేరుకున్న పోయిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాలు కనుగొనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో సమీక్ష కూడా జరిపారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుద్ధీకరణ, నదికి పునరుజ్జీవం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితిని జిల్లా ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంత రైతాంగంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది.

మూసీ ప్రక్షాళణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో మల్లన్నసార్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ‘‘ దశబ్ధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. కాళ్లు, చేతులు వంకర్లుపోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే.. బీఆర్ఎస్ పార్టీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు ..’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సమీక్ష సమావేశంలో ఆగ్రహంవ్యక్తం చేశారు.

మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ బాధితులను రెచ్చగొట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాయని.. పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసి ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని కూడా మంత్రి సమీక్ష సమావేశం నిర్ణయించింది. అన్ని జిల్లాల ప్రజలు గోదావరి, కృష్ణానీళ్లతో వ్యవసాయం చేస్తూ, తాగునీటిని వాడుకుంటుంటే.. భయంకరమైన రసాయనలు కలిసిన మురికినీళ్లను ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎందుకు వాడుకోవాలన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో భాగంగా 8వ తేదీన మూసీ వెంట పాదయాత్ర చేయించాలన్న ప్లాన్ తో ఉన్నారు.

అయితే, సీఎం పాదయాత్ర అధికారికంగా మాత్రం ఖరారు కాలేదు. కానీ, ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించారని సమాచారం అందుతోంది. ఆసిఫ్ నహర్ ప్రాజెక్టు కాల్వల మీదుగా, మూసీ పరీవాహక ప్రాంత రైతులను కలుస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాదయాత్ర జరపాలన్న నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. మూసీ మురుగునీటి ప్రధాన బాధితులుగా ఉన్న ఉమ్మడి నల్గొండ రైతాంగం, ప్రజల మద్దతు కూడగట్టేందుకు సీఎం పర్యటనను ఉపయోగించుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు ప్లాన్ తో ఉన్నారని చెబుతున్నారు.

మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర

Telangana | సబర్మతి తరహాలో మూసి ప్రక్షాళన రేవంత్ రెడ్డి పక్కాప్లాన్ | Eeroju news

Related posts

Leave a Comment