CM Revanth Reddy | రేవంత్ జిల్లాల బాట… | Eeroju news

Revanth Reddy

రేవంత్ జిల్లాల బాట…

మహబూబ్ నగర్, జూలై 4, (న్యూస్ పల్స్)

CM Revanth Reddy

రేవంత్ జిల్లాల బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు.. దాని కారణంగా వచ్చిన ఎలక్షన్ కోడ్‌. దీని వల్ల అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ హడావుడి అంతా ముగిసింది. కాబట్టి.. పాలనపై ఫుల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలేంటి అనే దానిపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు.. అధికారులు తమ తీరును మార్చుకోవాలంటూ కొంచెం సీరియస్‌గానే క్లాస్ తీసుకున్నారు రేవంత్. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్‌మెంట్‌ల కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో చాలా కీలక సూచనలతో పాటు.. కొన్ని ఆదేశాలను కూడా జారీ చేశారు.

అధికారులు ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించాలి. వినూత్న ఆలోచనలను ఎప్పటికప్పుడు నేరుగా సీఎంవోతో పంచుకోవాలి. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్‌ షిప్‌ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. సమయపాలన తప్పనిసరిగా పాటించాలి. కేవలం ఆఫీసులకు పరిమితం అవ్వడం కాకుండా.. తమ డిపార్ట్‌మెంట్ పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒక రోజు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. అసలేం పనులు జరుగుతున్నాయి? వాటి పురోగతి ఎక్కడి వరకు వచ్చింది? ఇలా ప్రతి విషయాన్ని పరిశీలించాలి.

ఇవీ సీఎం రేవంత్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. అక్కడితో అయిపోయిందా..? కాలేదు. ఇవీ సెక్రటేరియట్‌లో ఉండే ఉన్నతాధికారులకు కూడా వర్తిస్తాయి. ఆ తర్వాత జిల్లాల కలెక్టర్ల వంతు. అసలు జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీస్‌ దాటుతున్నారా? అని డైరెక్ట్‌గానే క్వశ్చన్ చేశారు. కలెక్టర్లు కూడా గ్రౌండ్‌ లెవల్‌లో పర్యటించాలి. హాస్పిటల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూల్స్‌, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ను ఎప్పటికప్పుడు సందర్శించాల్సిందే. వ్యక్తుల ఇష్టాలకు అనుగుణంగా కాదు.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లిపోయాయి. అంతేకాదు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని.. సీఎంవో ఇచ్చే సలహాలు, సూచనలను పాటించాలని కూడా చెప్పారు.

మరి అందరూ అధికారులకు చెప్పారు. మరి మీ సంగతేంటి అని ఎవరు అడగకముందే.. సీఎం రేవంత్ మరో విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలోనే తాను కూడా వారానికో జిల్లా పర్యటనకు వెళ్తానన్నారు రేవంత్. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తానంటున్నారు రేవంత్. అధికారులను, స్థానిక ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందన్నారు. కాబట్టి.. అధికారుల తీరు ఎలా ఉందన్నది నేరుగా ప్రజల వద్ద నుంచే ఫీడ్ బ్యాక్‌ తీసుకోనున్నారు రేవంత్ అని దీన్ని బట్టి అర్థమవుతోంది. నిజానికి పాలన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రూటే సపరేట్‌ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గత పదేళ్లుగా తెలంగాణలో పాలన విధానం చూసిన వారికి ఇది కొత్త విషయమే.

బీఆర్ఎస్‌ పాలనలో అధికారం మొత్తం ఏకఛత్రాదిపత్యంగా ఉండేది. పేరుకు అధికారులు ఉన్నా.. అధికారం మాత్రం కొందరి చేతుల్లోనే ఉండేదన్న విషయం అందిరికీ తెలిసిందే.. సామాన్య అధికారులను పక్కన పెడితే ఎమ్మెల్యేలకే సీఎంతో కలిసి మాట్లాడే చాన్స్ లేకుండా ఉండేది. పర్యవేక్షించేవారే లేకపోవడంతో ఉన్నతాధికారులు కార్యాలయాలు దాటకపోయేవారు. వారిని చూసి కిందిస్థాయి అధికారులు కూడా నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరించేవారు. కానీ ఇదంతా గతం అంటున్నారు రేవంత్ రెడ్డి. నిద్రాణంగా ఉన్న అధికారవ్యవస్థ ఇక పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు. అధికారులు అలర్ట్‌గా ఉన్నారా? లేదా? అనేది కూడా స్వయంగా తానే పరిశీలించేందుకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy

 

కేంద్రమంత్రులకు రేవంత్ సూచనలు | Revanth Reddy advice to Central Ministers | Eeroju news

Related posts

Leave a Comment