చంద్రబాబు ఒక్కరే భేటీయేనా…
న్యూఢిల్లీ, జూలై 5, (న్యూస్ పల్స్)
CM Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరసగా కలుస్తున్నారు. కేవలం నిధులను అత్యధికంగా సమీకరించే దిశగానే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఆయన నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలసి రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చేలా సహకరించాలని కోరుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంట తీసుకెళ్లకపోవడంపై ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ ను కూడా వెంట తీసుకెళితే మరింత బలంగా ఉండేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా తీసుకెళుతున్నారు. ప్రధానిని కలిసినా, కేంద్రమంత్రులతో భేటీ అయినా రేవంత్ రెడ్డి వెంట మల్లు భట్టి విక్రమార్క ఉంటారు. ఇక పార్టీ అగ్రనేతలను కలసినప్పుడు కూడా ఆయన తన వెంటే డిప్యూటీ సీఎంను అంటి పెట్టుకుని వెళతారు. పార్టీ పెద్దలను కలసినప్పుడు సరే.. కానీ ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు డిప్యూటీ సీఎంను తీసుకెళ్లడం అంటే అది ఒక గౌరవం ఇచ్చినట్లవుతుందంటారు. ఆయనకు కూడా పాలనలో భాగస్వామ్యం ఇవ్వడమే కాకుండా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తారు.
కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చే సరికి చంద్రబాబు ఒక్కరే ఢిల్లీకి వెళ్లడాన్ని జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. పవన్ కల్యాణ్ కు ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేకపోయినా జనసైనికుల్లో మాత్రం ఈ ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. పవన్ కల్యాణ్ ను ఢిల్లీ తీసుకెళితే మోదీ, కేంద్ర మంత్రుల వద్ద మరింత బలంగా ఉండి, రాష్ట్రానికి అత్యధికంగా నిధులు, ప్రయోజనం చేకూరుతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పింఛన్ల పంపిణీలో లబ్దిదారులకు అందచేసిన కరపత్రాలలోనూ పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంపై జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ను కావాలని సైడ్ చేస్తున్నారా? లేదా అనుకోకుండా జరుగుతుందా? అని పార్టీ అగ్రనేతలను ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ వల్లనే కూటమి ఏర్పాటు సాధ్యమయిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పవన్ గట్టిగా పట్టుబట్టి పోకుండా ఉండి ఉంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని, రాజమండ్రి జైలు బయట చేసిన ప్రకటన నుంచి పొత్తులు కుదిరే వరకూ పవన్ చేసిన కృషిని మర్చిపోయారా? అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్థానం పవన్ కల్యాణ్ కు ఇవ్వాల్సిందేనని, సమ ప్రాధాన్యత ఇస్తేనే తమకు తృప్తిగా ఉంటుందని కూడా కొందరు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అయితే పవన్ ను ఆహ్వనిస్తే ఆయన తాను ఢిల్లీకి ఇప్పుడు రాలేనని చెప్పారా? లేక మామూలుగానే చంద్రబాబు పర్యటన చేపట్టారా? అన్న విషయంలో పార్టీ అగ్రనేతలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకూ జనసైనికుల్లో అసంతృప్తి బయటపడుతూనే ఉంటుంది.