ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్ని
విజయవాడ, ఆగస్టు 19 (న్యూస్ పల్స్)
Chinni as president of Andhra Cricket Association
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడిగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో ఈ నెల 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించారు. కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది.
అధ్యక్షుడితోపాటు అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు శుక్రవారం విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడిగా పి.వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా పి.విష్ణుకుమార్‌రాజు (విశాఖ నార్త్ ఎమ్మెల్యే), కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డి. గౌరు విష్ణుతేజ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవరూ నామినేషన్లు వేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8న ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాతి రోజున అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు.
The strategy behind botsa competition… | బొత్స పోటీ వెనుక వ్యూహం… | Eeroju news