మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయా
కర్నూలు, జూన్ 24, (న్యూస్ పల్స్)
Changing politics of Kurnool Corporation :
కర్నూలు నగర మేయర్ అతి ప్రధానమైనది. నగర అభివృద్ధి చెందాలంటే నగర పాలక సంస్థపై పెత్తనం ఉండాల్సిందే. ప్రస్తుతం నగర మేయర్ గా వైసీపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మొత్తం 52 డివిజన్లకు గానూ 9 మినహా అన్నింటిలోనూ వైసీపీదే విజయం. 19వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన రామయ్య మేయర్‌గా కొనసాగుతున్నారు. ముఖ్యమైన పనులు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. పార్కులు అభివృద్ధి చేయడం మురికి కాలువలు శుభ్రం చేయడం, తాగునీటి సమస్య తీర్చడం అలాంటి పనులు చేయడమే కాకుండా నగరమంతా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండడంలో తనదైన ముద్ర వేసుకున్నారు రామయ్య. డిప్యూటీ మేయర్ గా సిద్ధారెడ్డి రేణుక వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ మారి టీడీపీకి అధికారం దక్కింది.
జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ వారే గెలుపొందారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలవడమే కాకుండా కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రి మొదటిసారిగా నగరానికి వచ్చిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. దీనిని బట్టి చూస్తే కచ్చితంగా నగరపాలక సంస్థపై పట్టు సాధించేందుకు టీడీపీ ముఖ్యంగా టీజీ భరత్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది. ప్రారంభంలో 52 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 9, వైసీపీకి 43 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందే 17, 22 డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఫలితాల తర్వాత 3,4,6,13 డివిజన్లకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 18 కి చేరుకుంది. మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం ఊపందుకుంది.
ప్రస్తుతం కర్నూలు నగరంలో కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలంతా టీడీపీ నుంచి గెలుపొందిన వారే. ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. టీడీపీ అన్ని విధాల పట్టు సాధిస్తున్నది అనే దానికి ఇదే నిదర్శనం. అవిశ్వాసం పెట్టాలంటే సగానికి పైగా మెజారిటీ ఉండాలి. జూన్ 19న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 13 మంది కార్పొరేటర్లు ఒక హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారని, కలిసికట్టుగా ఉంటే పనులు చేసుకోవచ్చని తీర్మానించినట్లు ప్రచారం జరుగుతోంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పట్ల విశ్వాసం విధేయత చూపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.కోడుమూరు కర్నూలు అసెంబ్లీ పరిధిలోని కార్పొరేటర్లు సైతం కొందరు టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే గనుక జరిగితే త్వరలోనే కర్నూలు మేయర్ పీఠంపై మార్పులు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనినీ కర్నూలు మేయర్ రామయ్య ఖండిస్తున్నారు.
నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని, చట్ట ప్రకారం నాలుగేళ్ల వరకు మేయర్ ని దించేందుకు వీలు లేదని తన అనుచరుల వద్ద రామయ్య అన్నట్లు తెలుస్తోంది. తప్పులను భూతద్దంలో వెతికి ఏదో విధంగా దారికి తెచ్చుకునే ప్రయత్నం టీడీపీ చేస్తుందనే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు నగరపాలక సంస్థను తన చేతుల్లో ఉంచుకునేందుకు మంత్రి టీజీ భరత్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఉండేందుకు వైసీపీ నేతలు లోలోపల ప్రయత్నాలు సాగిస్తున్నారట. అయినా అధికారంలో ఒక పార్టీ కార్పొరేటర్లు మరో పార్టీ అయితే వ్యక్తిగతంగా, కార్పొరేషన్ పరంగా అభివృద్ధికి అడ్డంగా ఉంటుందని టీడీపీ నేతలు కార్పొరేటర్లకు చెప్పినట్లు సమాచారం. దీంతో రానున్న రోజుల్లో కర్నూలు మేయర్ పీఠంపై మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలతోపాటు గూడూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, బేతంచెర్ల తదితర నగర పంచాయతీలలో కూడా మార్పు తేవాలని అధికారం మార్చాలని టీడీపీ ముఖ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులు జిల్లాకు రాగానే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. నగర పురపాలక పెత్తనం పోకుండా చేసుకునేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహం చేయనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!
వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news