Changes in YCP district presidents | వైసీపీ జిల్లా అధ్యక్షల మార్పులు | Eeroju news

Changes in YCP district presidents

వైసీపీ జిల్లా అధ్యక్షల మార్పులు

అనంతపురం, ఆగస్టు 8, (న్యూస్ పల్స్)

Changes in YCP district presidents

ఊహించని పరాభవం తర్వాత వైసీపీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ముందుగా ఆయన ఆనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీకి జిల్లా రథసారధిగా మొదట శంకర్ నారాయణ కొనసాగారు. జిల్లాల విభజన తర్వాత అనంతపురానికి పైలా నర్సింహయ్య.. సత్యసాయి జిల్లాకు హిందూపురం నేత నవీన్ నిశ్చల్ నియమితులయ్యారు. అయితే ప్రక్షాళనలో భాగంగా జగన్ ఈసారి ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారో అని తీవ్రంగా చర్చ జరుగుతోందిఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్నది రెడ్డి సామాజిక వర్గ నాయకులు.

అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో బీసీ కార్డును ముందుపెట్టి ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాల్లో 12.. రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు. ఆ రెండు ఎంపీ స్థానాల్లో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలైన కురుబ, బోయ సామాజిక వర్గాలకు స్థానం కల్పించారు. అన్నీ బాగానే ఉన్నప్పుడు అధ్యక్ష మార్పు గురించి ఎప్పుడు ప్రస్తావన రాలేదు. కానీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జిల్లా అధ్యక్షులు మార్పుపై చర్చ రావడంతో ఎవరైతే బాగుంటుందని.. వైసీపీ అధినాయకత్వం మీమాంసలో పడ్డారని భావిస్తున్నారు.వైసీపీ జిల్లా అధ్యక్ష పదవులకు కూడా భారీగానే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు అనంతపురం, సత్యసాయి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇద్దరు బీసీ నేతలు నిర్వహించారు.

దాంతో మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ నేతలకే ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. రెండు జిల్లాలకు ఒకే సామాజిక వర్గం అయితే మొదటికే మోసం వస్తుందనుకొని ఒక జిల్లాకు బీసీ.. మరో జిల్లాకు ఓసీ అయితే సమతుల్యత ఉంటుందని అనుకుంటున్నారట. అందుకు గాను అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శంకర్ నారాయణకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు. అలానే సత్యసాయి జిల్లాకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని అనుకుంటున్నారు.జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు.. శంకర్ నారాయణ సుముఖంగా లేనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా శంకర్ నారాయణ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే పనిచేయడానికి అంగీకరించే అవకాశం ఉందని మరో వాదన బయటకి వస్తోంది.

మరోవైపు అనంతపురానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ లలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజకీయ అనుభవం ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారని చర్చ జరుగుతోంది.అటు సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి పేరు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.

వెంకట రామిరెడ్డి.. సీనియర్ నాయకుడుగా జిల్లా గురించి.. అలానే తాగు, సాగునీటి పట్ల అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే వెంకట రామిరెడ్డి జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీలో కీలక పదవుల్లో ఒకటి కావాలని కోరుతున్నారట. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి లాంటివారికి జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తే బాగుంటుందని పలువురు నాయకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ క్రమంలో జగన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు తీవ్ర చర్చ జరుగుతోంది. మళ్లీ బీసీ కార్డు తోనే ముందుకు వెళ్తారా.. లేక సమన్యాయం చేస్తారా.. నేతలను సంతృప్తి చేయడానికి పదవితో పాటు కోటరీలో కూడా ఛాన్స్ ఇస్తారా ? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే..

Changes in YCP district presidents

 

YCP is empty in the kuppam | కుప్పంలో వైసీపీ ఖాళీ | Eeroju news

Related posts

Leave a Comment