Chandrababu Focus on Visakha | విశాఖపై చంద్రబాబు ఫోకస్ | Eeroju news

Chandrababu Focus on Visakha

విశాఖపై చంద్రబాబు ఫోకస్

విశాఖపట్టణం, జూలై 13,   (న్యూస్ పల్స్)

Chandrababu Focus on Visakha

మహా విశాఖ నగరం… తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక నగరం.. సిటీ ఆఫ్‌ డెస్టినీగా చెప్పే ఈ సాగర నగరం రాజకీయంగా ఎంతో ప్రధానం. ఉత్తరాంధ్రలో కీలక నగరం… రాష్ట్రానికి ఆయువు పట్టు. అందుకే ఈ నగరాన్ని గత ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేసుకుంది. అదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చి విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆలోచన. గత, ప్రస్తుత ప్రభుత్వాలు వేటికవే విశాఖలో తమ బ్రాండ్‌ ప్రమోట్‌ చేసుకోవాలని చూసినా, విశాఖ వాసులు మాత్రం చంద్రబాబు బ్రాండ్‌కే పట్టం కడుతున్నారు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ విశాఖను తన మానస పుత్రికగా భావిస్తుంటారు.ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు.. సరిగ్గా నెల రోజుల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు.

ఏదో సాదాసీదా పర్యటనగా కాకుండా… విశాఖ అభివృద్ధే అజెండాగా తన తొలి పర్యటనను మల్చుకున్నారు చంద్రబాబు. విశ్వనగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే తన ప్రణాళికను వేగవంతం చేయడంలో భాగంగా తొలి పర్యటనలోనే భోగాపురం విమానాశ్రయ పనులను పర్యవేక్షించారు సీఎం. అటు విశాఖ నగరానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు తాగు, సాగునీటి సమస్య పరిష్కరించొచ్చనేది చంద్రబాబు ఆలోచన. అందుకే ఒకే సమయంలో అటు పోలవరం ప్రాజెక్టు పనులతోపాటు విశాఖ అభివృద్ధిపైనా దృష్టిపెట్టారు చంద్రబాబు. ఇక తాజాగా విశాఖను ఫిన్‌టెక్‌ జోన్‌గా అభివృద్ధి చేయాలనే తన భవిష్యత్‌ ప్రణాళికలను తెరమీదరకు తెచ్చారు చంద్రబాబు.

చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖపై ఎప్పుడూ ప్రత్యేక ఫోకస్‌ చేస్తుంటారు. ఒకసారి సీఎంగా ఉండగా ఒకే ఏడాదిలో 16 సార్లు విశాఖను సందర్శించారంటే విశాఖ నగరానికి ఆయన ఎంత ప్రాధాన్యమిస్తారనేది ఊహించొచ్చు. అందుకే విశాఖవాసులు ఎన్నడూ చంద్రబాబు వెంటే ఉంటామని చాటుతుంటారు. 2019లో రాష్ట్రం మొత్తం టీడీపీ తుడిచిపెట్టుకుపోయినా, విశాఖ నగరంలో నాలుగుస్థానాల్లో గెలిపించి మేమున్నామని భరోసా ఇచ్చారు. ఇక తాజా ఎన్నికల్లోనూ విశాఖలో కూటమికి.. ముఖ్యంగా టీడీపీకి బంపర్‌ మెజార్టీలు కట్టబెట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేను గెలిపిస్తే… మూడో మెజార్టీతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గెలిపించారు విశాఖ వాసులు.

ఈ రెండు నియోజకవర్గాలు మహా విశాఖనగరంలో అంతర్భాగమే కావడం విశేషం.ఇక గత ప్రభుత్వం ఎప్పుడూ విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెబుతూనే ఉండేది. కానీ, స్థానికులు మూడో రాజధానిగా విశాఖను వద్దనుకున్నారని అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. ఉత్తరాంధ్రలో కీలక నేతలంతా ఓటమి పాలవడం కూడా వైసీపీపై స్థానికుల వ్యతిరేకతకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. ఈ కారణంతోనే చంద్రబాబు తాజా పర్యటనలో విశాఖపై మరింత ఫోకస్‌ చేశారు. అటు అనకాపల్లి నుంచి ఇటు విజయనగరం జిల్లా సరిహద్దుల వరకు విస్తరించిన విశాఖ మహానగరంలో వివిధ పనులపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. తాజా పర్యటన ద్వారా విశాఖకు తాను ఎంత ప్రాధాన్యమిస్తున్నానే విషయం మరోసారి ఆవిష్కరించిన చంద్రబాబు.. నగర వాసుల్లో సరికొత్త ఆశలు, ఆకాంక్షలు రేపారు.

 

Chandrababu Focus on Visakha

 

CM Chandrababu’s cabinet meeting on 16th of this month in AP | ఏపీ లో ఈనెల 16న సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం | Eeroju news

Related posts

Leave a Comment