కాకినాడ, జూన్ 15, (న్యూస్ పల్స్)
పవన్ సినిమాలు చేయరా? ఫుల్ టైం రాజకీయాలు చేస్తారా? ఇప్పుడు ఆసక్తికర చర్చ ఇదే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కు చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, పర్యావరణం, అటవీ శాఖ బాధ్యతలను పవన్ కు అప్పగించారు. ఆపై డిప్యూటీ సీఎం. పవన్ కు దక్కిన శాఖలన్నీ కీలకమే. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలి. రివ్యూలు జరపాలి. అందుకే ఇప్పుడు పవన్ సినీ కెరీర్ పై అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం పెండింగ్ సినిమాలు పూర్తి చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది.
అటువంటి పరిస్థితుల్లో పవన్ కీలక శాఖలను ఎలా నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారుతోందిసంక్రాంతి నుంచి పవన్ సినిమాలు ముందుకు కదల్లేదు. వారాహి యాత్రతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొన్నారు. దీంతో సినిమా షూటింగ్లకు విరామం ప్రకటించారు. అటు ఎన్నికల అఫీడవిట్లో సైతం చాలామంది నిర్మాతల నుంచి అప్పు తీసుకున్నట్లు చూపించారు. అయితే అది ముందస్తు అడ్వాన్స్ గా తెలుస్తోంది. ఈ లెక్కన వారికి సినిమాలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు పవన్ తో కీలక ప్రాజెక్టులకు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఉన్నవే పెండింగ్ సినిమాలు. ఆపై రాజకీయాల్లో బిజీగా మారడంతో కొత్త ప్రాజెక్టులకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కు కేటాయించిన శాఖలు చూస్తుంటే మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సినిమాల వైపు వెళ్లరన్న ప్రచారం జరుగుతోంది.పవన్ చాలా సందర్భాల్లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. తనకు సినిమాల కంటే రాజకీయాలంటేనే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో రాణించేందుకు డబ్బులు కావాలని.. అందుకే నటిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. యాక్టింగ్ ద్వారా వచ్చిన సొమ్ముతోనే గత పదేళ్లుగా జనసేన పార్టీని నడిపారు. ఎన్నో రకాల సాయాలను ప్రజలకు అందించారు. ఇప్పుడు నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం మంత్రి పదవుల ద్వారా పవన్ కు దక్కింది. అందుకే ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ నటనకు దూరమైతే ఆయన అభిమానులు ఊరుకుంటారా? అంటే మాత్రం ఊరుకోరు అనే సమాధానం వినిపిస్తోంది.
కానీ ప్రజల కోసం పవన్ అభిమానులను ఒప్పించేందుకు, అవసరమైతే నొప్పించేందుకు కూడా సిద్ధపడతారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి.. కొత్త వాటికి మాత్రం ఒప్పుకోరు అని తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి.. అభిమానులకు మిశ్రమ ఫలితం ఇచ్చినట్లు అయింది. మంత్రిగా పవన్ ను చూడాలనుకున్నవారు.. నటన నుంచి దూరమైతే మాత్రం జీర్ణించుకోలేరు. ఈ పరిస్థితి నుంచి పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.