కమలంలో కొత్త కయ్యం…
హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్0
తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం రచ్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు 23 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే పలు జిల్లా అధ్యక్షుల ఎంపిక పార్టీలో అసంతృప్తులకు దారి తీస్తోంది. తాము సూచించినవారికి కాకుండా మరో నేతకు అవకాశం ఇచ్చి..తమకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్పిన వారికి కాకుండా వేరే వారికి ఎలా బాధ్యతలు కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు నేతలు.పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా..ఎవరికి పడితే వారికి జిల్లా అధ్యక్ష పోస్ట్ ఇచ్చారని గరం గరం అవుతున్నారు పలువురు నేతలు. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినవారికి మాత్రమే మండల, జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చింది బీజేపీ స్టేట్ హైకమాండ్. మరికొన్ని జిల్లాల్లో మాత్రం లోకల్ లీడర్ల ఓపీనియన్‌ను లెక్కలోకి తీసుకోలేదట. ఇక కొందరు నేతలు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తే అదీ దక్కకా..జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఒకే ఇంట్లో రెండు పోస్టులు ఇవ్వడంపై కూడా పలువురు నేతలు మండిపడుతున్నారట.ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఆడియో పార్టీలో సంచలనంగా మారింది. రాజాసింగ్ అంటే హిందుత్వం, హిందుత్వం అంటే రాజాసింగ్ అన్న బ్రాండ్ ఉంది. ఆయన రాష్ట్రంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో జరిగే హిందువుల సమావేశాల్లో పాల్గొంటారు. జాతీయ స్థాయిలో సంఘ్‌లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి నేత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నేతలు మరో వర్గాన్ని తయారు చేసే పనిలో పడ్డారన్న గుసగుసలు వినబడుతున్నాయి.గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమా మహేందర్‌ను ప్రకటిస్తారంటూ ముందుగా లీకులు వచ్చాయి. దీనిని రాజాసింగ్ వ్యతిరేకించడంతో 10రోజులు పాటు జిల్లా అధ్యక్షుడి పేరు ప్రకటనను వాయిదా వేశారు. ఆ తర్వాత ఉమా మహేందర్ పేరునే గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడంతో రాజాసింగ్ బరస్ట్ అయిపోయారు.
వెంటనే ఒక ఆడియో రిలీజ్ చేసిన రాజాసింగ్ పార్టీకి తన అవసరం లేదనుకుంటే నో ప్రాబ్లమ్..తాను ఏం చేయాలో అది చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారుగోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా తాను సూచించిన వ్యక్తి పేరు కాకుండా వేరే వ్యక్తిని ప్రకటించడంతో రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సన్నిహితుల దగ్గర తన ఆవేదన చెప్పుకున్నారట. పార్టీలో చేరినప్పటి నుంచి ఓ వైపు ఎంఐఎంతో మరోవైపు సొంత పార్టీ నేతలతో పోరాటం చేస్తున్నానని బాధపడుతున్నారట. ఈ మధ్య పార్టీలో వేధింపులు మరీ ఎక్కువ అయ్యాయని మధనపడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.రాజాసింగ్ రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు టాక్. పార్టీలో కొంతమంది బ్రోకరిజం చేస్తున్నారని..తన సన్నిహితుల దగ్గర బాధను చెప్పుకున్నారట రాజాసింగ్. గోల్కొండ జల్లా బీజేపీ అధ్యక్ష పదవి బీసీ లేదా ఎస్సీకి ఇవ్వాలని తాను సూచిస్తే..ఎంఐఎం పార్టీలో తిరిగే వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు రాజాసింగ్.రాష్ట్ర బీజేపీలోని ఓ అగ్రనాయకుడికి ఫోన్ చేసి జిల్లా అధ్యక్ష నియామకంపై ఆరా తీశారట రాజాసింగ్. సదరు నేత తనకు తెలియకుండానే ఇది జరిగిందని నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారట. దాంతో ఇప్పటికే ఎంఐఎం, కాంగ్రెస్‌తో యుద్దం చేస్తున్నానని..రాష్ట్ర నాయకత్వంతో వేధింపులకు గురి అవుతున్నానని మరింత ఆవేదన చెందుతున్నారట రాజాసింగ్.తన నియోజక వర్గంలో కూడా పుల్లలు పెడితే పార్టీకి రిజైన్ చేసేందుకు కూడా వెనకాడబోనని తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ పార్టీ నేతకు చెప్పినట్టు సమాచారం. జిల్లా అధ్యక్షుడిని మార్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడికి రెండు రోజుల సమయం ఇస్తానని..ఒక వేళ మార్చకపోతే తానేంటో చూపిస్తానని రాజాసింగ్ అనడం పార్టీలో కలకలం రేపుతోంది. తాను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నానని..17న తిరిగి వచ్చిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం.ఇదంతా ఇలా ఉంటే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రఘునాథరావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోగా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించారు.
కానీ మరో బీజేపీ నేత అంజిరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అంతేకాదు అంజిరెడ్డి భార్య గోదావరిని సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.బీజేపీ కుటుంబ పార్టీ కాదని చెప్పుకునే మనం..ఒకే ఇంట్లో ఇద్దరికి అవకాశాలు ఇవ్వడమేంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. అసలు మెదక్ జిల్లా ప్రజలకే పెద్దగా పరిచయం లేని అంజిరెడ్డిని నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారట నేతలు. పైగా అంజిరెడ్డి సతీమణికి సంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పగించడం కూడా చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదట. ఓవైపు మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్‌రావుతో అంజిరెడ్డికి ఎప్పటినుంచో గ్యాప్ ఉందట.కొత్తగా కేంద్ర మంత్రి బండిసంజయ్‌తో కూడా అంజిరెడ్డికి పొసగడ లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏరికోరి మరీ అంజిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టడం వెనుక అంతర్యమేంటని కమలం పార్టీ నేతలనే గుసగుసలు పెట్టుకుంటున్నారు. స్థానికంగా ఉన్న ఓ కీలక ప్రజాప్రతినిధి వ్యతిరేకించినప్పటికీ గోదావరికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా చర్చకు దారి తీస్తోంది.మరోవైపు పెద్దపల్లి, భువనగిరి జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పార్టీలో అంతర్గతంగా పోరుకు దారితీసాయి. మరోవైపు షాద్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఎంపీ డీకే అరుణ, రంగారెడ్డి అధ్యక్ష పదవి విషయంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఐదు పేర్లు సూచిస్తే పట్టించుకోకుండా ఆరో వ్యక్తి వైపు మొగ్గు చూపడంతో కొండా కోపంగా ఉన్నారని టాక్.అయితే మిగతా నేతల సంగతి ఎట్లున్నా..రాజాసింగ్ రూటే సెపరేట్. ఆయన ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కాస్త బరస్ట్ అయిన రాజాసింగ్ తన దారి తాను చూసుకుంటారా లేక అధిష్టానం ఆయన డిమాండ్‌కు లొంగుతుందా అనేది వేచి చూడాలి మరి.