రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్…
కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్…
ఏలూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)’
రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తోన్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ తరువాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్… చివరికి కోళ్ల ఫామ్‌లనే చుట్టేసి విలయతాండవం చేస్తోంది.ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 6, 7 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించాయి. వాటిని విజయవాడలోని రాష్ట్ర పశువ్యాది నిర్ధారణతో పాటు భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి పంపాయి. దీంతో కొన్ని శాంపిల్స్ లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలను గుర్తించి… అక్కడ వ్యాప్తి నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టారుబర్డ్ ఫ్లూ రోజురోజూకు విజృంభిస్తోంది. లక్షల్లో కోళ్లు మృతి చెందాయి. కోళ్ల ఫామ్‌ల వద్ద గుట్టలు, గుట్టలు కోళ్లు బర్డ్ ఫ్లూ (ఏవీయన్ ఇన్ఫ్లుఎంజా)తో మృతి చెందుతున్నాయి. దీంతో అధికారులు కొవిడ్ నాటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కొన్ని కిలో మీటర్ల దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొన్ని రోజులు పాటు చికిన్ తినొద్దని తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు.తూర్పుగోదావరి జిల్లాల్లో పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కానూరుకు పది కిలో మీటర్ల పరిధిలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానూరుకు కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్, పది కిలో మీటర్ల పరిధిలో సర్వైలెన్స్ జోన్ ఏర్పాటు చేశారు.
ఏవీయన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. కానూరుకు పది కిలో మీటర్ల పరిధిలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దని సూచించారు. అలాగే కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లోనే 9542908035 మొబైల్ నెంబర్‌తో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారుపశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్‌కి కిలో మీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి తీసుకున్న నమూనాలను పరీక్షంగా బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది. దీంతో వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.ఇన్ఫెక్షన్ జోన్ నుంచి 1 నుంచి 10 కిలో మీటర్ల వరకు ఆ ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించారు. కోళ్ల ఫామ్‌కు పది కిలో మీటర్ల పరిధిలో లోపల, వెలుపల కోళ్లు, గుడ్లు రవాణా నిషేధం విధించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్, ఎగ్స్ దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.మరోవైపు ఈ వైరస్ విజృంభించడంతో కోళ్ల ఫామ్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఒకపక్క కోళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో పాటు కోళ్లు, గుడ్లు రవాణా నిషేధంతో రెండు రకాలుగా నష్టపోతున్నామని కోళ్ల ఫాం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయని, అమ్మకాలు భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు. దీనివల్ల కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని… కోట్లల్లో నష్టం వాటిళ్లిందని చెబుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.