అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న బైడెన్
న్యూయార్క్, జూలై 22, (న్యూస్ పల్స్)
Biden dropped out of the US presidential race
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా బైడెన్ ప్రకటించి తన మద్దతుదారులకు షాకిచ్చారు. డెమోక్రటిక్ పార్టీ కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం వరకు, జనవరి 2025 వరకు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల బైడెన్ కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ క్రమంలో US అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా చేసే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. జో బైడెన్ ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవడంతో భారత సంతతి మహిళకు గొప్ప అవకాశం లభించింది. బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా రేసులోకి కమలా హ్యారిస్ వచ్చారు. కమలా హ్యారిస్‌కు బైడెన్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కమలా హ్యారిస్ ను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిక ఎంపిక చేయడం తాను తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటని పేర్కొన్నారు.
ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో డిబేట్‌లో పాల్గొన్న జో బైడెన్ మాట్లాడిన తీరును చూసి తోటి డెమోక్రాట్స్ ఆయనను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని కోరారు. కొందరు నేతలు నేరుగానే బైడెన్ అభ్యర్థిత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు.‘తోటి డెమోక్రాట్ మిత్రులారా, నామినేషన్‌పై నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నా పదవీకాలం ముగిసేవరకు పూర్తిస్థాయిలో అధ్యక్షుడిగా కొనసాగుతాను.
2020లో పార్టీ నుంచి కమలా హారిస్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం. ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉండేందుకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. కమలా హ్యారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిగా ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఈ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు డెమొక్రాట్లు అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. చేసి చూపిద్దామని’ కీలక ప్రకటన అనంతరం జో బైడెన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.