తిరుమల, జూన్ 15, (న్యూస్ పల్స్)
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించింది. తాజాగా టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ ఈవోను మార్చుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జే శ్యామల రావు 1997కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఈయన్ను దేవాదాయ శాఖలోని రెవెన్యూ విభాగానికి బదిలీ చేస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమించింది. వెంటనే ఇప్పటివరకూ ఉన్న ఈవో ఏవీ ధర్మారెడ్డిని రిలీవ్ చేసింది.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన మరుసటి రోజే టీటీడీపై దృష్టి సారించారు. ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తానని అక్కడే ప్రకటించారు. ఆ మరుసటి రోజే టీటీడీకి నూతన ఈవోను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీ ఈవో స్థానంలో ఇప్పటివరకు పని చేసిన ఏవి. ధర్మారెడ్డిని వెంటనే రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.