AP Tourism : టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ

AP_Tourism

టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ

విశాఖపట్టణం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులను త్వరితగతిన వేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు శరవేగంగా రావడానికి అవసరమైన ప్రతిపాదనలకు ఓకే చెప్పనుంది. దీంతో ఏపీలోని పలు టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయనున్న నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అభ్యర్థనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. మరో వారం, పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు.

ప్రధానంగా విశాఖపట్టణం జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు అరవై శాతం పూర్తయ్యాయని, కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారుఇవన్నీ పూర్తయితే పర్యాటక రంగం పూర్తిగా అభివృద్ధి చెందడంతో పాటు రాష్ట్రానికి కూడా అదనంగా ఆదాయం రానుంది. గత ప్రభుత్వం లెక్కకు మించిన అప్పులు చేయడంతో దానిని పూడ్చుకునేందుకు ప్రతి శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అందులో ఏపీలో టూరిజానికి ప్రత్యేకత ఉంది. దేవాలయాలతో పాటు విశాలమైన సముద్ర తీర ప్రాంతం కూడా ఉండటం, బీచ్ లతో పాటు కోనసీమ అందాలు వంటి వాటితో పాటు అరకు వంటి వాటిని హైలెట్ చేయగలిగితే ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే అవకాశముంది. ఏపీకి టూరిజం నుంచి అత్యధిక ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడంలో భాగంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. వాటిని గ్రౌండ్ చేయడానికి సిద్ధమవుతుంది. అక్కడ పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు రవాణా, వసతి వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టింది.

Read : Visakhapatnam:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలోదారి

Related posts

Leave a Comment