ఏపీ కాంగ్రెస్ ఫ్యూచర్ లేనట్టేనా
విజయవాడ, జూలై 11, (న్యూస్ పల్స్)
AP Congress has no future
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. దేశమంతా కాంగ్రెస్ కు అనుకూలత కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అస్సలు కొరుకుడు పడటం లేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన మూడు ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయిందంటే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకత పెంచుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. వరసగా మూడుసార్లు అనేక ప్రయోగాలు చేశారు. కానీ ఏ ప్రయోగం విజయవంతం కాలేదు. సరికదా కాంగ్రెస్ ను కలుపుకోవడానికి కూడా ప్రధాన పార్టీలు ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆ పార్టీ పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది.
వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల పేరిట చేస్తున్న హడావిడికి ఎంత మాత్రం స్పందన వస్తుందన్నది చూడాలి. వైఎస్ షర్మిలను నమ్మి నేతలు ఎవరూ వస్తారన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలకు స్థానం లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి కొంత సానుకూలత ఉంది. ఇక్కడ ఏ పార్టీ పార్లమెంటు స్థానాలను గెలిచినా అన్నీ బీజేపీ ఖాతాలోనే గత పదేళ్ల నుంచిపడుతూ వస్తున్నాయి. అందుకే బీజేపీకి ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ కాంగ్రెస్ కు అలా కాదు.
ఇటు రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ కానీ, వైసీపీ కాని కాంగ్రెస్ ను కలుపుకుని పోవడానికి ఇష్టపడటం లేదు. మొన్నటి ఎన్నికల్లో కేవలం బలం లేని కమ్యునిస్టులు విధిలేని పరిస్తితుల్లో జత కట్టారు. రాష్ట్ర విభజన చేసిన పార్టీగా ఇప్పటికీ ప్రజలు కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారన్న భయంతో దానిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. నిజానికి ఏపీలో జాతీయ పార్టీలకు స్థానం లేదు. కేవలం ప్రాంతీయ పార్టీలనే ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, క్యాడర్ గంపగుత్తగా వైసీపీ కి వెళ్లిపోయారు. కొద్దో గొప్పో నేతలున్నప్పటికీ వారు బయటకు వచ్చి పార్టీ బలోపేతానికి పనిచేసేవారు కారు.
కాంగ్రెస్ మూడు ఎన్నికలకు ముందు అనేక ప్రయోగాలు చేసింది. తొలిసారి పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డిని నియమించింది. 2014లో అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో ఆగ్రహించిన ప్రజలు ఆ పార్టీని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇక 2019 ఎన్నికలసమయంలో దళిత వర్గానికి చెందిన సాకే శైలజానాధ్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే అప్పుడు కూడా జనం ఆదరించలేదు. రెండుసార్లు శాసనసభలోకి కాంగ్రెస్ సభ్యులు కాలుమోపలేకపోయారు. జనం ఆగ్రహం ఇంకా తగ్గలేదని సర్దిచెప్పుకున్నారు.
ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలను పీీసీీసీ చీఫ్ గా నియమించి మరో ప్రయోగం చేశారు. అయితే ఎన్నికలకు ముందు కొంత ఊపు కనిపించినట్లు కనిపించింది కానీ ఫలితాలు మాత్రం కనపడలేదు. కనీసం కడప లాంటి చోట షర్మిల కూడా గెలవలేకపోయారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ దక్కని వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ముగిసినతర్వాత ఫలితాలను చూస్తే మూడు శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు రావడంతో ఇక వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్లు కూడా ఎవరూ ఉండకపోవచ్చు. వైఎస్ షర్మిలది ఏపీలో కాంగ్రెస్ ఆఖరి ప్రయోగంగానే చెప్పుకోవాలి. అంతకు మించి మరొకరిని నియమించినా ప్రయోజనం ఉండదు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఏపీలో కాంగ్రెస్ కు మంచి రోజులు రావన్నది నిజం.
Congress Party President Sharmila | షర్మిల.. లెక్కేంటీ.. | Eeroju news