ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం
విజయవాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్)
AP Cabinet
ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కేబినెట్ ముందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కొత్త పాలసీలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని రూపొందించింది. ఇవే కాకుండా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్, కొత్త ఎంఎస్ఎంఈ పాలసీపై కేబినెట్లో చర్చ కొనసాగుతోంది.
2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ సాగుతోంది.వీటితో పాటు మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణ, ఉద్యోగ కల్పన, మంత్రుల కమిటీల నియామకంపై మంత్రివర్గంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.