AP Assembly meetings | అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్… | Eeroju news

అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్...

అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్…

ఎంత వరకు… ఉపయోగం

విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్)

AP Assembly meetings

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ దేవాలయం లాంటిది. ఎన్నికలు జరిగేది ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి. వారు చేయాల్సిన పని అసెంబ్లీలో చర్చించి చట్టాలు చేయడం.. ప్రజాసమస్యలపై మాట్లాడటం. అలాంటి సభ నిస్సారంగా జరిగితే..వన్ సైడెడ్‌గా ఉంటే ప్రజలకు కూడా ఆసక్తి ఉండదు.కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తామని రానే రాబోమని స్పష్టం చేసింది. అయితే అధికార పక్షం వైసీపీని సభకు వచ్చేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారపక్షం చొరవ తీసుకుని వైసీపీతో సంప్రదింపులు జరపాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పెద్దగా చర్చలకు అవకాశం ఉండేది కాదు.కానీ ఇప్పుడు ప్రతి అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపేలా ఉంటున్నాయి. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఏకపక్షంగా మారిపోయాయి.

విపక్షంగా పూర్తి స్థాయిలో బాయ్ కాట్ చేయాలని నిర్ణమయించడమే దీనికి కారణం. మొదటి సమావేశాల సమయంలో అందరూ హాజరయ్యారు. కాకపోతే అప్పుడు ప్రమాణ స్వీకారాల సమయం.చర్చలు జరగలేదు. అయినా ఆ సమావేశాలపై ప్రజలు ఆసక్తి చూపించారు. కానీ బడ్జెట్ సమావేశాల్లో విపక్షం లేకపోవడంతో అక్కడ ప్రజాసమస్యలపై చర్చలు జరిగినా ప్రశ్నించడానికి ప్రతిపక్షంలేదు కాబట్టి ప్రజలు కూడా ఆసక్తి చూపించడం మానేశారు. ప్రతిపక్షం ప్రజాతీర్పును గౌరవించి సభకు వెళ్లాలన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదుల్లో వినిపిస్తోంది. ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల తరపున మాట్లాడాల్సి ఉంది. అయితే జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా స్పీకర్ ఇవ్వాలంటున్నారు. కానీ అలా ఇచ్చేది తాము కాదని ప్రజలే అని.. ప్రజలు ఇవ్వలేదని స్పీకర్ తేల్చేస్తున్నారు.

తాము కాక మరో పార్టీ లేనప్పుడు ఇంకెవరికి ప్రతిపక్ష హోదా ఇస్తారని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఆయన వాదనలో మెరిట్ ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. హోదా ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతిపక్ష నేతే. దాన్ని ఎవరూ కాదనలేరు. ఆ హోదాలో ఆయన ప్రశ్నించవచ్చు. మాట్లాడేందుకు సమయం ఇస్తారా లేదా అన్నది తర్వాత సంగతి ముందు అసెంబ్లీకి వెళ్తేనే కదా ఆ విషయం తెలుస్తుందని సహజంగా ప్రజలకు వచ్చే సందేహం. దీనిపై తర్వాత అయినా వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్నపాత్రుడు చాలా సార్లు పిలుపునిచ్చారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రయత్నం జరగలేదదు.

సాధారణంగా సభా వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు చర్చలు జరుపుకుని సభను నిర్వహించుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా వైసీపీతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరపాలని అంటున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా.. ఇతర అంశాలపై ఒప్పించి వారిని సభకు వచ్చేలా చూడాలని అంటున్నారు. అయితే ఇప్పటి వరకూ అధికారపక్షం నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరగలేదు. టీడీపీ ఈ విషయంలో కాస్త చొరవ తీసుకుంటే ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడినట్లు ఉంటుందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. మరి టీడీపీ ఆ విషయంలో ఏమైనా ఆలోచిస్తుందా.. రాకపోతే మాకే మంచిదని సైలెంట్‌గా ఉంటుందా ?

అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్...

Ys Sharmila Vs Ys Jagan | చంద్రబాబు అసెంబ్లీకి రానప్పుడు ఎక్కడున్నావ్ షర్మిల ? | FBTV NEWS

Related posts

Leave a Comment