ప్రైవేట్ పనుల్లో బెజవాడ పోలీసులు
సోషల్ మీడియా, యూ ట్యూబర్లతో దోస్తీ చేస్తున్న బెజవాడ పోలీసులు ప్రజల వ్యక్తిగత గోప్యతతో చెలగాటాలు ఆడుతున్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో కొందరు పోలీసులే వీడియోలు రికార్డు చేసి ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విజయవాడలో ట్రాఫిక్ చలాన్లు, నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారిని పోలీసులు ప్రశ్నించే వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ అవుతున్నాయి. మహిళలు, వృద్ధులు, ఉద్యోగుల వాహనాలను తనిఖీ చేసే సమయంలో నిబంధనల్ని ఉల్లంఘిస్తే వారికి జరిమానా విధిస్తున్నారు. జరిమానాలతో పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారి వీడియోలను పోలీసులే సోషల్ మీడియాలో షేర్ చేయిస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనల్ని కఠినంగా అమలు చేసే విషయంలో ఎవరికి అభ్యంతరం లేకున్నా, చలానాలను విధించే సమయంలో పోలీసులు బాడీ కెమెరాలతో రికార్డు చేస్తున్న వీడియోలు, మొబైల్ ఫోన్లలో రికార్డు చేసే వీడియోలను యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లతో షేర్ చేస్తున్నారు. ఈ తరహా వీడియోలు వైరల్ అవుతున్నాయి.తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని సైతం మీడియా ముందు ప్రవేశ పెట్టే సమయంలో ముసుగులు వేసి చూపించే పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి విషయంలో వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాపిక్ కూడళ్ల వద్ద సాధారణంగా విఐపి మూమెంట్ ఉంటే తప్ప పోలీసులు కనిపించరు. రద్దీ సమయాల్లో జనం ఎవరి బాధలు వారు పడాల్సిందే.ట్రాఫిక్ నియంత్రణ సంగతి ఎలా ఉన్నా నిత్యం ఉదయం, సాయంత్రం చలాన్లు రాయడం మాత్రం విధిగా చేపడుతున్నారు. ట్రాఫిక్ జరిమానాలు మార్చి 1 నుంచి గణనీయంగా పెరిగాయి.
ఈ క్రమంలో ప్రతి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పోటాపోటీగా చలాన్లు విధిస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడే వారిని న్యాయస్థానంలో హాజరు పరిస్తే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు.ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే క్రమంలో పోలీస్ అధికారులు ఉద్దేశ పూర్వకంగా వాటిని సొంత పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. కానిస్టేబుళ్లతో వీడియోలు తీయించుకుని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు షేర్ చేస్తున్నారు. ఆ వీడియోల్లో హెల్మెట్ పెట్టుకోని యువతీ యువకుల్ని పోలీసులు మందలించడం, హెచ్చరించడం వంటివి కూడా ఉంటున్నాయి. జరిమానాలు చెల్లించక పోతే వాహనాలను సీజ్ చేస్తున్నారు.పోలీసులు రికార్డు చేసే వీడియోలను న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా మాత్రమే పరిగణించాల్సి ఉండగా పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా వేదికలపై షేర్ చేయడం, వారి ముఖాలను అందరూ గుర్తించేలా షేర్ చేస్తున్నారు. పోలీసుల అధికారిక హ్యాండిల్స్‌లో కూడా మహిళలు, మైనర్ల ఫోటోలను ముఖాలను గుర్తించేలా షేర్ చేస్తున్నారు. పోలీసుల తనిఖీల సందర్భంగా యువతులు, విద్యార్థినులు, మహిళల్ని ప్రశ్నిస్తున్న ఫోటోలను బహిరంగ వేదికలపై షేర్ చేస్తున్నారు.విజయవాడ సీపీగా కాంతి రాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీలు ఉన్న సమయంలో సొంత పబ్లిసిటీ కోసం కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లను ప్రోత్సహించారు. పర్సనల్ వీడియోలతో పబ్లిసిటీ చేయించడం, యువతలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం వీటిని కొందరు అధికారులు ఉపయోగించే వారు. ఈ తరహా వీడియోలకు మిలియన్లలో వ్యూలు, వేలల్లో లైక్‌లు వస్తున్నాయి తద్వారా అయా ఛానళ్లకు భారీగా ఆదాయం కూడా లభిస్తోంది. ఏపీ పోలీస్ శాఖ వీడియోలను బయటి వారికి షేర్ చేయడం వాటితో ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం పొందడంపై అధికారులు కిమ్మనడం లేదు.పోలీస్ అధికారులు విధుల్లో ఉన్న సమయాల్లో క్లోజప్ షాట్స్, డ్రోన్ షాట్స్ తో సినిమాటిక్ ఎఫెక్ట్‌లతో పబ్లిసిటీ చేయించుకునే వారు. ఆ తర్వాత అధికారులు మారినా మిగిలిన వారు కూడా వాటిని అనుసరించడం మొదలు పెట్టారు. సీఐ స్థాయి అధికారుల నుంచి డీసీపీల వరకు ఇదే బాట పట్టారు. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగమని తెలిసినా తీవ్ర నేరాలకు పాల్పడినట్టు సోషల్ మీడియాలో దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ల విధించే సమయంలో రికార్డు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై షేర్ చేయడంపై విజయవాడ ట్రాఫిక్ డీసీపీ వివరణ కోరినా స్పందించలేదు.