Andhra Pradesh:సీనియర్లకు మొండి చేయి:తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన పూర్తిగా మారింది. పార్టీ పది కాలాల పాటు అధికారంలోకి రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. చట్ట సభల్లో ఏ పోస్టు ఖాళీ అయినప్పటికీ దానికి యువకులను ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. టీడీపీలో కష్టపడితే పదవులు వస్తాయన్న సంకేతాలను బలంగా పంపడానికే ఈ రకమైన నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల సేవలను ఇప్పటి వరకూ వినియోగించుకున్నా వారిని పార్టీ సేవలకే ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
సీనియర్లకు మొండి చేయి..
కాకినాడ, మార్చి 5
తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన పూర్తిగా మారింది. పార్టీ పది కాలాల పాటు అధికారంలోకి రావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. చట్ట సభల్లో ఏ పోస్టు ఖాళీ అయినప్పటికీ దానికి యువకులను ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉంది. టీడీపీలో కష్టపడితే పదవులు వస్తాయన్న సంకేతాలను బలంగా పంపడానికే ఈ రకమైన నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల సేవలను ఇప్పటి వరకూ వినియోగించుకున్నా వారిని పార్టీ సేవలకే ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఎలాంటి మొహమాటాలు లేకుండా సీనియర్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలని భావిస్తున్నారు. పార్టీ ఏర్పడి దాదాపు యాభై ఏళ్లు కావస్తుండటంతో సీనియర్ నేతలు టీడీపీలో పాతుకుపోయి ఉన్నారు. వారు మర్రిచెట్టులాగా తయారయ్యారన్న విమర్శలు క్యాడర్ నుంచి ఎదురవుతున్నాయి. వారు తప్పించి నియోజకవర్గాల్లోనూ, మరే పదవుల్లోనూ మరొకరికి స్థానం దక్కదన్న బలమైన అభిప్రాయం ద్వితీయ శ్రేణి నేతల్లో ఉంది. 2019 నుంచి 2024 వరకూ యువనేతలే ఎక్కువగా పార్టీకి కష్టపడ్డారు. చంద్రబాబు నిర్వహించిన అనేక సభలకు జనసమీకరణను కూడా వారే దగ్గరుండి చూశారు. సీనియర్ నేతలు పెద్దగా ఆ ఐదేళ్లు పార్టీని పట్టించుకోలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. సీనియర్ నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అందులోనూ యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని దాదాపుగా డిసైడ్ అయినట్లు తెలిసింది.
ఇప్పటికే కొందరు తమంతట తామే రాజకీయాల నుంచి తప్పుకోగా, మరికొందరు పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. వారు పార్టీకి భారంగా మారారన్న వాదన బలంగా వినిపిస్తుంది. నియోజకవర్గాల్లో క్యాడర్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అలాగే తమ రాజకీయాల కోసం పార్టీని బలి చేస్తున్నారన్న వాదన మాత్రం అధినాయకత్వం జరిపిన సర్వేల్లోనూ వెల్లడి కావడంతో ఇక సీనియర్లకు చెక్ పెట్టాలన్న నిర్ణయానికి పార్టీ అధినాయకత్వం వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కూడా యువకులకే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ క్యాడర్ మనోభిప్రాయాలను గౌరవిస్తూ భవిష్యత్ నేతలను తయారు చేసుకునే పనిలో సైకిల్ పార్టీ ఉందనే చెప్పాలి. ఇక నారా లోకేశ్ యుగం కావడంతో యువతకే ప్రాధాన్యం ఇస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మంత్రి వర్గం కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. యువత అయితే పార్టీని నమ్ముకుని పనిచేయడమే కాకుండా తమకు వచ్చిన పదవితో సంతృప్తి పడతారని, అదే సీనియర్ నేతలయితే ఎమ్మెల్సీ పదవి వచ్చినా తమకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో నిత్యం ఉంటారన్న భావన అధినాయకత్వంలోనే ఉంది. అందుకే ఈ నాలుగు సీట్లలోనూ తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు భర్తీ చేస్తారంటున్నారు. సీనియర్ నేతలకు పొలిట్ బ్యూరో లో స్థానం కల్పించకుండా, పార్టీ సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితం చేయాలని హైకమాండ్ డిసైడ్ అయింది.