Andhra Pradesh:షర్మిళ వర్సెస్ సునీత:వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు కేసు కొలిక్కి రాలేదు. దీంతో ఆయన కుమార్తె సునీత తీవ్ర అసహనంతో ఉన్నారు.
షర్మిళ వర్సెస్ సునీత.
కడప, ఫిబ్రవరి 17
వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అవుతోంది. కానీ ఇంతవరకు కేసు కొలిక్కి రాలేదు. దీంతో ఆయన కుమార్తె సునీత తీవ్ర అసహనంతో ఉన్నారు. వైఎస్ షర్మిల, సునీతల మధ్య విభేదాలు తలెత్తయా? ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందా? షర్మిల వైఖరిపై సునీత ఆగ్రహంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య అంశం మరుగున పడిపోయింది. ఇది సునీతకు మింగుడు పడడం లేదు. అదే సమయంలో వైయస్ షర్మిల సైతం సైలెంట్ అయ్యారు. దీనిపైన ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు సునీత. దీంతో అక్కా చెల్లెలు మధ్య మాటల యుద్ధం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రాజకీయ ఎదుగుదలకు వివేకానంద రెడ్డి హత్యను వాడుకున్నారని.. ఇప్పుడు న్యాయం చేయలేకపోతున్నారని సునీత మండిపడుతున్నట్లు సమాచారం. కడప పొలిటికల్ సర్కిల్ ఇదే చర్చ నడుస్తోంది.2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వైయస్ వివేకానంద రెడ్డి అప్పట్లో ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నిందితులకు కఠిన శిక్ష పడుతుందని వివేక కుమార్తె సునీత ఆశించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి సీన్ మారింది. అప్పటివరకు సిబిఐ దర్యాప్తు కోరిన జగన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వినిపించాయి. అప్పటినుంచి వివేక కుమార్తె సునీత న్యాయపోరాటానికి దిగారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆమె పావులు కలిపారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లారు.
అయితే సోదరుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించారు షర్మిల. అటు బాబాయి వివేకానంద రెడ్డి హత్య అంశంలో సోదరి సునీతకు మద్దతు తెలిపారు.2024 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు వైయస్ షర్మిల, సునీతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. వ్యతిరేక ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి ఒక కారణం అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక్క అంచు కూడా ముందుకు కదలడం లేదు. వైయస్ సునీత సీఎం చంద్రబాబు తో పాటు హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను కూడా కలిశారు. హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే నెలలు గడుస్తున్నా కేసు విచారణలో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. దీంతో వైఎస్ సునీతలో అసహనం పెరుగుతోంది. ఆమె న్యాయపోరాటం సాగిస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేసు విషయంలో ఆశించిన స్థాయిలో పావులు కదపడం లేదు.మరోవైపు వైయస్ షర్మిల సైతం వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని విడిచిపెట్టారు. గత ఎనిమిది నెలలుగా ఆమె నోటి నుంచి వివేకానంద రెడ్డి హత్య మాటలు రావడం లేదు. దీంతో వైయస్ సునీత షర్మిలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై గత రెండు రోజులుగా వాట్సాప్ మెసేజ్ ల రూపంలో ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తున్నట్లు అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యావు అంటూ సునీత షర్మిలను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందని.. మున్ముందు ఇది ఎంతవరకు దారితీస్తుందోనని అనుమానాలు ఉన్నాయి. అయితే మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.