Andhra Pradesh:వివేక హత్య కేసు నిందితుల అనుమానస్పద మరణాలు.

viveka-murder-case
Andhra Pradesh:వివేక హత్య కేసు నిందితుల అనుమానస్పద మరణాలు.:వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు సినిమా క్రైమ్ను తలపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, అనుమానితులు ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురు మరణించారు. వీరందరి మరణాలు ఒకే రీతిన ఉండడం, అవన్నీ సహజ మరణాలుగానే రిపోర్టు అవుతుండడం అనుమానాలకు తావిస్తోంది.తాజాగా ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడం, తన తండ్రికి అందించిన వైద్య చికిత్సపై అనుమానాలు ఉన్నాయని రంగన్న కొడుకు కాంతారావు ఫిర్యాదు చేశాడు.

వివేక హత్య కేసు
నిందితుల అనుమానస్పద మరణాలు.

కడప, మార్చి 10
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు సినిమా క్రైమ్ను తలపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్షులు, అనుమానితులు ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురు మరణించారు. వీరందరి మరణాలు ఒకే రీతిన ఉండడం, అవన్నీ సహజ మరణాలుగానే రిపోర్టు అవుతుండడం అనుమానాలకు తావిస్తోంది.తాజాగా ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడం, తన తండ్రికి అందించిన వైద్య చికిత్సపై అనుమానాలు ఉన్నాయని రంగన్న కొడుకు కాంతారావు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ మరణాల వెనక సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. వివేకా హత్య కేసు నిందితులే ఈ చావుల వెనక ఉన్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఈ మరణాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయన ఓ మాజీ ఎంపీ.. అంతే కాదు.. ఓ మాజీ సీఎంకు సోదరుడు.. ఆ జిల్లాలో అతిపెద్ద రాజకీయ కుటుంబానికి ఆయన ముఖ్యనేత. అలాంటి ఆయన తన సొంతింట్లో క్రూరంగా హత్యకు గురయ్యారు. అనుమానితులున్నారు… ఆధారాలున్నాయి. సాక్ష్యాలూ ఉన్నాయి. ఆరేళ్లు అయినా ఆ కేసుకు అతీగతీ లేదు. అంతలోనే ఆ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ చనిపోతున్నారు. అందుకే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని పలుకుబడి కలిగిన నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే ఇదంతా అని మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.
చాలా కాలంగా రాజకీయ నాయకులు, మీడియా కూడా బాగా మాట్లాడి మాట్లాడి వదిలేసిన ఈ కేసు గురించి మళ్లీ చెప్పుకోవడానికి కారణం.. ఈ కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మరణం. చూడటానికి సహజమరణంలానే కనిపిస్తోంది కానీ ఈ కేసులో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు… కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంతో ప్రతీ విషయాన్ని అనుమానించాల్సి వస్తోంది.  ఇప్పటి వరకూ ఇలా ఆరుగురు చనిపోయారు. జనంలో అనుమానాలుండటమే కాదు.. ఇప్పుడు పోలీసుశాఖ కూడా ఈ గొలుసుకట్టు మరణాల తీగను పట్టుకుంది. మరి డొంక కదులుతుందో లేదో చూడాలి. అసలు ఈ కేసుపై ఎందుకు అనుమానాలంటే.. అప్పట్లో జరిగిన వ్యవహారాలు అలాంటివి మరి. ఆరేళ్ల కిందట  వివేకా మర్డర్ జరిగిన దగ్గర నుంచి.. నిన్న రంగయ్య చనిపోయిన వరకూ అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. ఈ హత్యలో ఉన్న కోణాలే కాదు.. ఆరేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ రంగాన్నే మలుపతిప్పింది కూడా. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ అడుగులోనూ ఒక్కో ట్విస్ట్ ఉంది. వరుసగా ఏం జరుగుతూ వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2019, మార్చ్ 15 తెల్లవారుజామున రక్తపుమడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్న ఆయన్ను లేపేందుకు ఆయన పీఏ కృష్ణారెడ్డి తెల్లవారుజామున ఇంటికి వెళ్లారు. ఎంతకూ నిద్రలేవకపోవడంతో వెనుక నుంచి తలుపులు తెరిచి వివేకా రక్తపు మడుగులో పడిపోయినట్లు గుర్తించారు.
నారాయణయాదవ్‌, జగన్‌ వాహన డ్రైవర్, సాక్షి :
వివేకా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జగన్‌, భారతి రెడ్డి హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు వచ్చారు. అప్పుడు వారి వాహనాన్ని నడిపిన నారాయణ 2019 డిసెంబరులో చనిపోయారు. అనారోగ్యంతో మరణించాడని ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల సిట్‌ ఎంక్వైరీ వేగం అందుకుంటున్న సమయంలో నారాయణ మరణించడం అనుమానాలకు తావిచ్చింది.హైదరాబాద్‌ నుంచి పులివెందుల వరకు సాగిన ప్రయాణంలో జగన్‌, భారతి, అవినాష్‌రెడ్డి తదితరుల మధ్య వివేకా మరణానికి సంబంధించిన ఫోన్‌ సంభాషణలు జరిగాయని, కారు నడుపుతున్న నారాయణ యాదవ్‌ అవి విన్నారనే కంప్లైంట్స్ ఉన్నాయి. దీంతో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాల్సి ఉంది. అయితే, విచారణకు పిలవకముందే అతను మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
బి.రంగన్న, వాచ్‌మన్‌, హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి
వాచ్‌మన్‌ బి.రంగన్న వివేకా ఇంటి వద్ద కాపలా ఉండేవాడు. ఆ రోజు వివేకా హత్యలో పాల్గొన్న వారిని ఆయన ప్రత్యక్షంగా చూశారు. అంతేకాదు షేక్‌ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకరరెడ్డి, సునీల్‌ యాదవ్ ఈ హత్య చేసినట్టు మేజిస్ట్రేట్‌ ముందు, సీబీఐ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చారు. రంగన్న వాంగ్మూలం తర్వాతనే అవినాష్‌రెడ్డి, శివశంకరరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరుల ప్రమేయం వెలుగు చూసింది. ఈ హత్య గురించి బయటకు చెబితే చంపేస్తానంటూ గంగిరెడ్డి తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలం ఇచ్చారు.ఆ విధంగా హత్య కేసులో అత్యంత కీలకంగా ఉన్న సాక్షి రంగన్న 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించారు. తొలుత అస్వస్థతకు గురయ్యారని పులివెందుల దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. తన తండ్రికి గతేడాది కాలికి గాయమైందని, పులివెందుల, కడప, హైదరాబాద్‌, తిరుపతి ఇలా ఎన్ని ఆసుపత్రులు తిప్పినా తగ్గలేదు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స వివరాలు అడిగితే పోలీసులు ఇవ్వలేదు. ఆ ట్రీట్మెంట్ పైన తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య, కొడుకు కాంతారావు ఆరోపిస్తున్నారు.
కల్లూరి గంగాధర్‌రెడ్డి, కీలక సాక్షి :
హత్య కేసులో ముఖ్యమైన సాక్షుల్లో కల్లూరు గంగాధర్‌రెడ్డి (40) ఒకరు. ఆయన 2022 జూన్‌లో చనిపోయారు. అనారోగ్యంతో మరణించారని అప్పట్లో ప్రచారం జరిగింది. హత్య కేసు దర్యాప్తు కోసం CBI బృందాలు పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇళ్లు, వివేకానందరెడ్డి నివాసం, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ఇది జరిగిన వెంటనే గంగాధర్‌రెడ్డి సందేహాస్పద స్థితిలో మరణించారు.వివేకాను హత్యను తనపై వేసుకుకుంటే రూ.10 కోట్లు ఇస్తారని దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనతో అన్నారని, ఆ ఆఫర్ను తాను తిరస్కరించానని గంగాధర్‌రెడ్డి సీబీఐకి చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి సీబీఐ బలవంతం చేస్తేనే అలా చెప్పానని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే గంగాధర్‌రెడ్డి అనుమానాస్పదంగా మరణించారు.
కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అనుమానితుడు :
వైఎస్సార్‌ జిల్లా కసనూరు గ్రామానికి చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (57) వివేకా హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య ప్లాన్ గురించి అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసు అనే సందేహాలు ఉన్నాయి. పరమేశ్వరరెడ్డి నార్కో టెస్టుకు హాజరై తిరిగొచ్చిన కొన్ని రోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి చనిపోయారు. రాష్ట్ర పోలీసు సిట్‌ ఈ కేసును విచారిస్తున్న సమయంలో 2019 సెప్టెంబరులో మరణించారు. అయితే, తన మరణానికి సిట్‌లోని ఇన్‌స్పెక్టర్‌ కారణమంటూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ఆయన రాశారని చెప్పిన రెండు లేఖల్ని పోలీసులు శ్రీనివాసుల రెడ్డి కుటుంబసభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లేఖలు ఆయన రాయలేదనే సందేహాలున్నాయి. శ్రీనివాసులరెడ్డి శరీరంలో లివర్, కిడ్నీ మధ్య భాగంలో రక్తపు ఆనవాళ్లు ఉన్నాయని ఫోరెన్సిక్‌ రిపోర్టు తేల్చింది. అవేంటో తేల్చకుండానే పోలీసులు కేసు మూసేశారు.
డాక్టర్ వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, సాక్షి :
వివేకా కేసులోని కీలకమైన సాక్షుల్లో వైఎస్‌ అభిషేక్‌రెడ్డి (36) ఒకరు. వివేకా మరణించినట్టు దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఫోన్‌ చేశారని, వెళ్లి చూస్తే రక్తపు, వివేకా నుదుటిపై గాయాలు కనిపించాయని, ఇది హత్యగానే భావించానని 2021 ఆగస్టులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారని ప్రస్తావించారు. అభిషేక్‌రెడ్డి ఒక వైద్యుడు, పైగా యువకుడు. ఆయన కూడా ఈ వాంగ్మూలం ఇచ్చిన కొన్నాళ్ల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది జనవరి నెలలో చనిపోయారు. ఈ మరణంపై చాలా అనుమానాలున్నాయి.
ఈసీ గంగిరెడ్డి, వైఎస్‌ భారతి తండ్రి :
వైఎస్‌ భారతి తండ్రి, జగన్‌ సొంత మామైన ఈసీ గంగిరెడ్డి (73) 2020 అక్టోబరులో అనారోగ్యంతో మరణించారు. వివేకా హత్య గురించి ఆయనకు తెలుసనే సందేహాలు ఉన్నాయి. వివేకా మృతదేహానికి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే కట్లు కట్టి, బ్యాండేజీలు వేశారు. నిందితులు గంగిరెడ్డి సదరు ఆసుపత్రికి వెళ్లి చేతులు కడుక్కున్నారనే ఫిర్యాదులు కూడా న్నాయి. ఆయన 2020 అక్టోబరు 3న మరణించారు. ఆయన మృతి కూడా అనుమానాస్పదంగా ఉంది.

Related posts

Leave a Comment