Andhra Pradesh:విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్:వైసీపీలో పడిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా తనలో దాచుకున్న అసంతృప్తి, ఆ పార్టీ అధ్యక్షుడితో ట పడిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.సాయిరెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక జగన్ ప్రత్యర్థుల అండదండలు ఉన్నాయనే అనుమానం వైసీపీలో ఉంది.
విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్
విజయవాడ, మార్చి 15
వైసీపీలో పడిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు మాజీ ఎంపీ సాయిరెడ్డి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా తనలో దాచుకున్న అసంతృప్తి, ఆ పార్టీ అధ్యక్షుడితో ట పడిన అవమానాలకు బదులు తీర్చుకునే క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.సాయిరెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక జగన్ ప్రత్యర్థుల అండదండలు ఉన్నాయనే అనుమానం వైసీపీలో ఉంది. సాయిరెడ్డి డైరెక్ట్ అటాక్ నేపథ్యంలో మున్ముందుజరిగే పరిణమాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.చార్టర్డ్ అకౌంటెంట్గా కెరీర్ ప్రారంభించిన విజయ సాయిరెడ్డి… వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో జగన్తో పాటు కేసులు, జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో జగన్ తర్వాత స్థానం తనదేనని భావించారు.వైసీపీలో సాయిరెడ్డి అంతులేని అధికారాన్ని, హోదాను అనుభవించారు. ఎంత వేగంగా వైసీపీలో ఎదిగారో అంతే వేగంగా వైసీపీలో ఆయన ప్రభావాన్ని కోల్పోయారు. వైసీపీలో జగన్ స్థానాన్ని కుదిస్తూ చివరకు పార్టీని వీడే వరకు పరిణామాలు నడిచాయి. ఈ క్రమంలో ఎవరి వాదన కరెక్ట్ అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పదవి, అధికారం అనుభవించి తన దారి తాను చూసుకున్నారనే విమర్శలతో పాటు ఆత్మాభిమానం కోసం వెళ్లిపోయారనే వాదన కూడా ఉంది.
2024 ఓటమికి ముందు జరిగిన పరిణామాలతో మనస్తాపం చెందిన సాయిరెడ్డి అదను కోసం ఎదురు చూసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వీయ రాజకీయ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్కు ఎదురు తిరిగితే జరిగే పరిణామాలను ఊహించే ఆయన తన టైమ్ కోసం ఎదురు చూసినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత జూన్లో వైసీపీ ఓటమి తర్వాత సాయిరెడ్డి తన దారి తాను చూసుకోవడం ప్రారంభించారు.వైసీపీలో రెండు సార్లు రాజ్యసభకు అవకాశం కల్పించినా ఆ పార్టీలో కొనసాగడం అనవసరం అనే భావనకు రావడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టు సాయిరెడ్డి సన్నిహతులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కీలక విషయాలపై సాయిరెడ్డి ప్రమేయాన్ని, ప్రాధాన్యతను తగ్గించడం, అధికారుల ఎదుట చులకన చేయడం, సాయిరెడ్డి బాధ్యతలు చెవిరెడ్డి నిర్వహిస్తారని ఐఏఎస్ అధికారులకు నేరుగా స్పష్టం చేయడం వంటి అంశాలతో జగన్తో దూరం పెరిగినట్టు తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలుగులోకి వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్ పరిణామాలతో జగన్ – సాయిరెడ్డి మధ్య దూరం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ వ్యవహారంలో సాయిరెడ్డి సమీప బంధువు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడం వైసీపీ అధినేత జగన్ను చికాకు పెట్టినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జరిగిన పరిణామాలతో సాయిరెడ్డి ప్రమేయం ఉందంటూ జరిగిన ప్రచారం ఆయన్ని మనస్తాపానికి గురి చేసిందనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఇటీవల రాజ్ కసిరెడ్డి పేరును నేరుగా సాయిరెడ్డి బయటపెట్టారు. ఈ మొత్తం పరిణామాలు ఆర్థిక లావాదేవీలతో ముడిపడినవి కావడంతో సాయిరెడ్డి-జగన్ మధ్య విభేదాలు తీవ్రమైనట్టు తెలుస్తోంది.నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడటం వెనుక సాయిరెడ్డి ప్రోత్సాహం ఉందంటూ ఆయన వ్యతిరేక వర్గం తాడేపల్లిలో విస్తృతంగా ప్రచారం చేసింది. సాయిరెడ్డి లోక్సభకు వెళితే ఆ స్థానంలో మరొకర్ని నియమించుకోవచ్చని భావించారు. నిజానికి సాయిరెడ్డికి లోక్సభకు వెళ్లడం ఇష్టం లేదు. రెండు విడతల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గర కావడానికి ఆయన రాజ్యసభ పదవి ఉపయోగపడింది. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం కూడా ఇందుకు కారణమైంది. బలవంతంగా లోక్సభకు పంపే ప్రయత్నాలు చేయడంతో వైసీపీని వీడాలనే భావన బలపడినట్టు తెలుస్తోంది.సాయిరెడ్డి ధిక్కార స్వరం వెనుక పూర్తి స్థాయి రాజకీయ అండదండలు ఆశీస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఢిల్లీ స్థాయిలో భరోసా లభించిన తర్వాతే ఆయన స్వరంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.
వైసీపీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడటంతో సాయిరెడ్డి చేరికు చిక్కులు ఏర్పడినట్టు తెలుస్తోందిఈ క్రమంలోనే కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో సాయిరెడ్డిపై కేసు నమోదైంది. తన పేరును ఇరికించడం వెనుక కుట్ర ఉందని సాయిరెడ్డి అనుమానిస్తున్నారు. దీంతో నేరుగా జగన్ సోదరుడు విక్రాంత్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి పేరుతో పాటు లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఇదంతా యాధృచ్చికంగా జరిగింది కాకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి.సాయిరెడ్డి నేరుగా కొన్ని పేర్లను ప్రస్తావించడం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంకేతాలనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు గవర్నర్ పదవి గ్యారంటీ అనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఇటీవల ఉపరాష్ట్ర పతి హైదరాబాద్ పర్యటనకు వచ్చినపుడు సాయిరెడ్డి అక్కడ ప్రత్యక్షం అయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటున్నారు.అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా సాయిరెడ్డి ఆ పార్టీ ముద్ర నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. ఆయన ఏ పార్టీలో చేరాలన్నా మొదట వైసీపీ ముద్ర నుంచి వదిలించుకోవాలనే కండిషన్తోనే తాజా పరిణామాలు జరుగుతున్నట్టు సమాచారం. తన తర్వాత తన కుటుంబ సభ్యులకు పొలిటికల్ కెరీర్ అందించే క్రమంలోనే సాయిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది.