Andhra Pradesh:రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార:రాష్ట్రంలో రేషన్‌కార్డు దారులకు కందిపప్పు పంపిణీ చేయడంలేదు. కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కందిపప్పు పంపిణీలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత మూడు, నాలుగు నెలల నుండి ఇదే తీరు ఉందంటున్నారు.
రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార
కడప, మార్చి 6
రాష్ట్రంలో రేషన్‌కార్డు దారులకు కందిపప్పు పంపిణీ చేయడంలేదు. కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెడుతున్నారని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కందిపప్పు పంపిణీలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత మూడు, నాలుగు నెలల నుండి ఇదే తీరు ఉందంటున్నారు. కందిపప్పు ఇచ్చినా అరకొరగానే కొంత మందికే అందుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్ కార్డులకు ప్రతినెలా రేషన్ సరుకులు అందిస్తున్నారు. బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం పంపిణీ జరగటం లేదు. ఈనెల కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు లేదని, అడగొద్దని రేషన్ డీలర్లు చెబుతున్నారు.గత మూడు, నెలల నుంచి ఇదే తంతు, ఈనెల కూడా కందిపప్పు పంపిణీ లేదని రేషన్ కార్డుదారులు అసంతృప్తితో ఉన్నారు. కందిపప్పు ఇస్తారేమోనని ప్రతి నెలా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం బియ్యం, పంచదార, కందిపప్పు ఇస్తామని చెప్పినప్పటికీ, కేవలం బియ్యం, పంచదారే అందుతుందని వినియోగదారులు అంటున్నారు. కందిపప్పు తీసుకుని కొన్ని నెలలు అవుతోందని, ప్రతినెలా అడిగినప్పుడు కందిపప్పు లేదని సమాధానం వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం, పంచదార మాత్రమే తమకు వచ్చిందని, వాటినే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నామని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు.రేషన్ కార్డు దారులకు కందిపప్పును రూ.67కు అందించేవారు. బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు ధర రూ.167 నుంచి రూ.180 వరకు ఉంటుంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసుకోలేకపోతున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
ఏపీలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, మరో 1,36,420 పీహెచ్‌హెచ్ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదు. ఈ కార్డులను తొలగిస్తే రూ.90 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 1.60 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే వెసులుబాటు ఉంటుందని నిర్ణయించారు.ఇప్పటికే రాష్ట్రంలో 3.30 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొత్త రేషన్ కార్డుల కోసం 30,611 దరఖాస్తులు, కార్డుల స్ల్పిట్ (విభజన) కోసం 46,918 దరఖాస్తులు, కుటుంబ సభ్యుల యాడింగ్ (కార్డులో చేర్చడం) కోసం 2,13,007 దరఖాస్తులు, తొలగింపు కోసం 36,588 దరఖాస్తులు, అడ్రస్ మార్పు కోసం 8,263 దరఖాస్తులు, సరెండర్ కోసం 685 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.