Andhra Pradesh:బలప్రదర్శనకు జనసేన:జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో జరగనున్నాయి. మార్చి 14న పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఈ సంధర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా జనసేన అధినాయకత్వం ప్రణాళిక రూపొందించింది.
బలప్రదర్శనకు జనసేన.
కాకినాడ, ఫిబ్రవరి 18
జనసేన ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలో జరగనున్నాయి. మార్చి 14న పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమవుతున్నారు. ఈ సంధర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా జనసేన అధినాయకత్వం ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల్లో విజయం తర్వాత నిర్వహించనున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకు ఈ సభ బలనిరూపణ కోసమా? వాస్తవంగా ఆవిర్భావ సభనే అంటూ రాజకీయ విశ్లేషకులు పెద్ద స్థాయిలో చర్చ సాగిస్తున్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టడంలో జనసేన కీలకంగా వ్యవహరించిందన్నది బహిరంగ రహస్యమే. వెంటీలేటర్ పై ఉన్న టీడీపీకి బీజేపీతో జతచేయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊపిరి అందించారని పలువురి అభిప్రాయం. ఇదే మాటను పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెప్పకనే చెప్పారు. అయితే కూటమి ఏకంగా 164 సీట్లలో విజయఢంకా మోగించింది. ఆ తర్వాత సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లు భాద్యతలు చేపట్టారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 8 నెలల పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది.అయితే ప్రభుత్వం వరకు ఓకే గానీ, కూటమిలోని పార్టీలు మాత్రం ఎవరి బలాన్ని వారు పెంచుకొనే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను నిర్వహించగా, ఊహించని స్థాయిలో కోటికి పైగా సభ్యత్వ నమోదు సాగింది. అలాగే వైసీపీ నుండి వచ్చిన పలువురు నాయకులకు టీడీపీ వెల్ కమ్ చెప్పింది. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఏమాత్రం వెనక్కు తగ్గినా ఊరుకొనే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తమ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మొత్తం మీద టీడీపీని మరింత బలోపేతం చేసేలా ఓ వైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్ తమ రాజకీయ పావులు కదుపుతున్నారు.
ఇక కూటమిలో రెండో పార్టీగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీ జనసేన. ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలనా పరమైన అంశాలపై దృష్టి సారించారు. అలాగే జనసేనలో నెంబర్ – 2 గా గల నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి వర్గంలో ఉండడంతో పార్టీ క్యాడర్ కు అంతగా అందుబాటులో లేరని ప్రచారం. మరో జనసేన కీలక నేత, పవన్ సోదరుడు నాగబాబు పార్టీ వ్యవహారాలను చూస్తూ వస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో పార్టీలో చేరికల నేపథ్యంలో నాగబాబు హాజరై, పార్టీలోకి వారిని సాదరంగా స్వాగతించారు. ఈ దశలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొందరు నేతలకు జనసేన కూడా స్వాగతం పలికింది. ఓ వైపు కోటికి పైగా సభ్యత్వ నమోదు పూర్తి చేసుకొని టీడీపీ క్యాడర్ హుషారుగా ఉండగా, ప్రస్తుతం జనసేన బలాన్ని కూడా పెంచుకోవాలన్న లక్ష్యం పార్టీ అగ్ర నాయకత్వంలో కనిపిస్తోంది.ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మార్చి 14న పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పవన్ సిద్దమయ్యారు. ఎన్నికల్లో తమ పార్టీ వందశాతం స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందుకున్న తర్వాత నిర్వహిస్తున్న తొలి పార్టీ సమావేశం ఇది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకొనేలా పవన్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేందుకు ఇప్పటి నుండే ఆయా జిల్లాల పార్టీ నాయకులకు తగు సూచనలు చేసినట్లు సమాచారం.ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసి, మళ్ళీ యావత్ దేశం దృష్టి ఆకర్షించేలా చేయాలన్నది పవన్ అభిమతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా విస్తృతం చేసి, పార్టీ క్యాడర్ కు ఇప్పటి నుండి అందుబాటులో ఉండాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ప్రతి గ్రామంలో క్యాడర్ ఉండాలన్నది పవన్ అభిమతమట. మొత్తం మీద పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ.. బల నిరూపణ సభ కానుందని రాజకీయ విశ్లేషకుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది.
Read more:Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు