Andhra Pradesh:టార్గెట్ కమ్మ సామాజిక వర్గం:ఏపీలో రాజకీయాలు అంటేనే సామాజిక సమీకరణలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ సామాజిక వర్గాలు రాజకీయాలను శాసిస్తుంటాయి. ఫలానా కులం ఫలానా పార్టీ అని చాలా సులువుగా చెప్పవచ్చు. కమ్మ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. కాపులంటే జనసేన.. ఇలా రకరకాలుగా విశ్లేషించుకోవచ్చు.
టార్గెట్ కమ్మ సామాజిక వర్గం
గుంటూరు, ఫిబ్రవరి 25
ఏపీలో రాజకీయాలు అంటేనే సామాజిక సమీకరణలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ సామాజిక వర్గాలు రాజకీయాలను శాసిస్తుంటాయి. ఫలానా కులం ఫలానా పార్టీ అని చాలా సులువుగా చెప్పవచ్చు. కమ్మ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం.. కాపులంటే జనసేన.. ఇలా రకరకాలుగా విశ్లేషించుకోవచ్చు. అయితే ఒక రాజకీయ పార్టీకి బలమైన మద్దతుదారులుగా సామాజిక వర్గాలు ఉంటాయి. ఇవి సహజం కూడా. అయితే కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పార్టీలను విపరీతంగా ద్వేషిస్తుంటాయి. 2019లో రెడ్డి సామాజిక వర్గం టిడిపిని ద్వేషించింది. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కమ్మ సామాజిక వర్గం ద్వేషించింది. అయితే రాజకీయ పార్టీలకు సామాజిక వర్గాల మద్దతు మాట అటుంచితే.. శత్రువులుగా మారిపోవడం ఇటీవల పరిపాటిగా మారింది. అందుకే పార్టీలు ఇప్పుడు సామాజిక వర్గాల వ్యతిరేకి అనే ముద్ర పోగొట్టుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బలంగా పనిచేసింది కమ్మ సామాజిక వర్గం. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గం వ్యక్తులు ఏకతాటిపైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. దీనికి కారణం లేకపోలేదు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమ్మ సామాజిక వర్గం ఒక రకమైన దాడి జరిగింది. వారి ఆర్థిక మూలాలపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి చెందిన వారి పరిశ్రమలను వెళ్ళగొట్టారు. వీటన్నింటికీ తోడు చంద్రబాబును జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారన్న కసితో కమ్మ సామాజిక వర్గం ఒకే తాటి పైకి వచ్చింది. అయితే 2019లో రెడ్డి సామాజిక వర్గం చేసిన ఫైట్.. 2024 ఎన్నికల్లో కనిపించలేదు. అది జగన్మోహన్
రెడ్డికి మైనస్ గా మారింది.
వాస్తవానికి ఏ సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాలని వ్యూహం ఉండదు ఏ రాజకీయ పార్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. కానీ విస్తరణలో భాగంగా తీసేసారు. వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు వైసీపీలోకి ఫిరాయించారు. కరణం బలరాం వంటి సీనియర్ను ప్రలోభ పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దేవినేని అవినాష్ వంటి నేతకు ప్రోత్సహించారు. అయితే అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం మూలాలపై దెబ్బ తగలడంతో వారు వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఒకరిద్దరు నాయకుల తప్ప కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేసారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దీని పర్యవసానాలు తెలిసాయి. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.వల్లభనేని వంశీని పరామర్శించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చాలామందికి నచ్చలేదు. కొంతమంది సీనియర్లకు కూడా ఇది మింగుడు పడలేదు. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి వల్లభనేని వంశీ లాంటి నేతలు కారణం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడంతో పాటు కమ్మ సామాజిక వర్గానికి అండగా నిలిచారన్న అంశం ముఖ్యం. దానిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించారు. అటు తన వెంట కొడాలి నానితో పాటు దేవినేని అవినాష్ ను పెట్టుకున్నారు. చంద్రబాబు,తన కుమారుడు ఎదగాలన్న కోణంలోనే ఆలోచిస్తున్నారని.. కమ్మ సామాజిక వర్గంలో ఇతర నేతల ఎదుగుదల వారికి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదంతా కమ్మ సామాజిక వర్గం మద్దతు కోసమేనని ప్రచారం నడుస్తోంది. మద్దతు తెలపక పోయినా పర్వాలేదు కానీ.. కమ్మ సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూడకుండా చేయాలన్నదే జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Read more:Andhra Pradesh:జగన్ ఎందుకిలా