Andhra Pradesh:ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు

ys jagan mohan reddy

Andhra Pradesh:ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు:వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రారంభోత్సవం నాడు అధ్యక్షుడు చేసే పనే కదా అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసిన పనేముంది.2011, మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్సార్సీపీని ప్రారంభించారు.

ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా
సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు

గుంటూరు, మార్చి 13
వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రారంభోత్సవం నాడు అధ్యక్షుడు చేసే పనే కదా అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసిన పనేముంది.2011, మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్సార్సీపీని ప్రారంభించారు. అంటే ఇప్పటికి 14 వార్షికోత్సవాలు జరిగాయి. అయితే వీటిలో ఇప్పటి వరకూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన జగన్ మోహనరెడ్డి ఎన్నిసార్లు జెండా ఎగరేశారో తెలుసా… రెండు లేదా మూడుసార్లు మాత్రమే…ఓ రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అన్నది చాలా ముఖ్యమైంది. అలాగే పార్టీ మీటింగ్‌లు, అప్పుడప్పుడు పార్టీ ప్లీనరీలు వంటివి చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ తమ వార్షిక వేడుకలు మహానాడు పేరుతో జరుపుకుంటుంది. జనసేన తొలిసారిగా ప్లీనరీని జరుపుకోబోతోంది. వైఎస్సార్సీపీ ఇంతకు ముందు రెండుసార్లు ప్లీనరీని నిర్వహించింది. ఇవాళ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జగన్ మోహనరెడ్డి తమ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండాను ఎగురేశారు.

పార్టీ జెండాలను ఆయా పార్టీల అధ్యక్షులు తరచుగా ఏమీ ఆవిష్కరించరు కానీ ఆవిర్భావం రోజు మాత్రం తప్పనిసరిగా ఆ పనిచేస్తారు. కానీ 2011లో పార్టీని ప్రారంభించి హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ లో కార్యాలయం ఏర్పాటు చేసినప్పుడు తొలిసారిగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో విజయం తర్వాత పార్టీ అడ్రెస్‌ విజయవాడకు మారింది. అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినా జగన్ మోహనరెడ్డి మాత్రం పార్టీ కార్యాలయానికి ఎక్కువుగా వెళ్లలేదు. ఈ పద్నాలుగేళ్లలో ఆయన జెండాను ఆవిష్కరించింది. పార్టీ కండువాను ధరించింది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే.తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2014లో హైదరాబాద్‌ లో శాసనసభ లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో జగన్ మోహనరెడ్డి పార్టీ కండువాను ధరించారు. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. 2019 ఎన్నికలకు ముందు గుంటూరులో నిర్వహించిన ప్లీనరీలో కూడా పార్టీ కండువా వేసుకోలేదు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి అసెంబ్లీకి వచ్చేప్పుడు కూడా వేసుకోలేదు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు.. అంతకు ముందు చాలా తక్కువుగా మాత్రమే పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం అయిన తర్వాత ఇక పార్టీ కార్యాలయం వైపే చూడలేదు.

చాలా సార్లు విజయవాడ కార్యాలయంలోనూ.. ఆ తర్వాత తాడేపల్లి బైపాస్‌ కార్యాలయాల్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర సీనియర్ నేతలే జెండాను ఆవిష్కరించారు.జగన్ మోహనరెడ్డికి జనంలో ఉన్న చరిష్మా వల్ల ఆయన తిరుగులేని మెజార్టీ సాధించారు కానీ.. ఆయన పార్టీని మాత్రం… జనరల్‌గా పార్టీని నడిపించే ప్రిన్సిపల్స్‌ ప్రకారం నడపలేదు. వైఎస్సార్సీపీకి కూడా హై లెవల్ నాయకుల కమిటీ ఉంది కానీ వాళ్లు సమావేశం అయ్యేది తక్కువ. వాళ్లతో జగన్ మీటింగ్ పెట్టేది మరీ తక్కువ . ఇక పార్టీ కార్యవర్గం, విస్తృత స్థాయి సమావేశాలు, పార్టీ అనుబంధ విభాగాలు మీటింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. వైఎస్సార్సీపీలో రాజకీయ వ్యవహారాలు అప్పట్లో ఉన్న త్రిమూర్తులు సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చూసుకునేవారు. విజయసాయిరెడ్డి పూర్తిగా ఉత్తరాంధ్రను.. వైవీ గోదావరి , రాయలసీమలను చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల వ్యవహారాలను సజ్జల చూసేవారు. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి- పార్టీకి మధ్య వారధిగా కూడా సజ్జలనే ఉన్నారు. ఇక జగన్ కుటుంబ ఆంతరంగిక బృందంలో చెవిరెడ్డి ఉంటూ.. పార్టీకి సంబంధించిన సర్వేలు, ఫీడ్‌బ్యాక్ మెకానిజం చూసేవాళ్లు.

మొత్తం మీద పార్టీ సెటప్ ఇదే. అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆయన పూర్తిగా పార్టీకి అందుబాటులో లేరు.ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి పార్టీ కార్యకలాపాల్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారని వైసీపీ నేతలు కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అదంత సమంజసంగా అనిపించదు. వైఎస్ జగన్ పార్టీని వద్దనుకోలేదు. పైగా ఆయన ఇంత వరకూ చరిత్రలో లేని విధంగా ఆ పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగానూ ప్రకటించుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు అది వేరే సంగతి. జాతీయ పార్టీల్లో పార్టీ అధ్యక్షులుగా లేని సీఎంలు.. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారు. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీజేపీ జాతీయ ప్లీనరీలో పాల్గొంటారు. ఇతర మీటింగ్‌లకు వెళతారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇప్పుడు అలాగే చేస్తున్నారు. చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడు, సీఎం కూడా ఆయన ఈ దఫా కూడా చాలాసార్లు పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అంతకు ముందూ చేశారు. అంతెందుకు జగన్ తండ్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సీఎంగా పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు.

ఈ విషయంపై పార్టీలో చర్చ జరిగినా ఆ విషయాన్ని ధైర్యంగా జగన్ కు చెప్పగలిగే వాళ్లు అప్పట్లో లేరు. కేవలం జగన్ ఇమేజ్ మీదనే తాము గెలిచాం కానీ.. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలు లేవని ఆ పార్టీ నేతలు అంటుండేవారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ ఆర్గనైజేషన్ ను బలపరచడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ.. అదేమీ సక్సెస్ కాలేదు.2024లో ఘైరమైన ఓటమి తర్వాత పార్టీ అధినేత జగన్ మోనహరెడ్డిలో కొంత మార్పు వచ్చింది అనుకోవచ్చు. ఓడిపోయిన వెంటనే ఆయన పార్టీ నేతల మీటింగ్ పెట్టారు. ఇక నుంచి నేను మీ తోనే అని చెప్పారు. ఎక్కువుగా పార్టీ నేతలను కలిశారు. ఐదేళ్లు పోరాటం చేద్దాం అని చెప్పారు. అంతే కాదు.. మొన్న అసెంబ్లీకి వైసీపీ కండువాను మెడలో వేసుకొని వచ్చారు. బహుశా ఈ 14 ఏళ్లలో ఆయన్ను పార్టీ కార్యకర్తలు ఓ 2-3 సార్లు మాత్రమే అలా కండువాతో చూసి ఉంటారు అంతే. ఇప్పుడు తరచుగా పార్టీ కార్యాలయానికి కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కార్యాలయం ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉంది. ఒకప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసుగా పనిచేసిన కార్యాలయాన్నే ఇప్పుడు వైఎస్సార్పీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. ఆయన ఇప్పుడు తరచుగా అక్కడకు వస్తున్నారు నేతలతో మాట్లాడుతున్నారు. చాలా మారిపోయారు. ఆ మార్పులో భాగమే.. ఇప్పుడు పార్టీ జెండా ఎగరేయడం. ఓడిపోయాక కానీ పార్టీని పట్టించుకోవాలని తెలిసిరాలేదు అని కొంతమంది సణుగుతుంటే.. ఏదైతే ఏంటి మాకు కావలసింది ఇదే అని ఆ పార్టీ కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు.

Read more:Andhra Pradesh:పవన్ కళ్యాణ్ శాఖలో లోకేష్ చొరవ

Related posts

Leave a Comment