Andhra Pradesh:అధికారుల మధ్య సమన్వయ లోపం.. ముందుకు సాగని పనులు

international educational institution

Andhra Pradesh:అధికారుల మధ్య సమన్వయ లోపం.. ముందుకు సాగని పనులు:విశాఖపట్నంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు కోసం వైసీపీ హయంలో భూమిని కేటాయించినా వాటిని అప్పగించ పోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో రూ.700కోట్ల ఖరీదు చేసే భూముల్ని అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కేటాయించింది.

అధికారుల మధ్య సమన్వయ లోపం..
ముందుకు సాగని పనులు

విశాఖపట్టణం, మార్చి 6
విశాఖపట్నంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు కోసం వైసీపీ హయంలో భూమిని కేటాయించినా వాటిని అప్పగించ పోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖలో రూ.700కోట్ల ఖరీదు చేసే భూముల్ని అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించినా భూములను వారికి అప్పగించ లేదు. ఈ క్రమంలో భూకేటాయింపుతో పాటు పలు అంశాలతో మరో ఫైల్‌ సిద్ధం చేసి సర్క్యూలేషన్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది.వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు మధురవాడ ప్రాంతంలో భూ కేటాయింపులు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు 2023 డిసెంబర్‌ 22న భూ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ఏపీ రెవిన్యూ శాఖ జీవో నంబర్‌ 606 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.గతంలోనే ఈ భూముల్ని విక్రయించాలని భావించినా పలు కారణాలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అప్పటికే విశాఖలో భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు, ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా విక్రయిస్తున్నారంటూ కోర్టు కేసులు నమోదు కావడంతో నాటి ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రభుత్వ భూముల కేటాయింపుకు సంబంధించిన విధివిధానాలకు అనుగుణంగా భూముల కేటాయింపు వ్యవహారం సాగింది. ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని భావించి పాఠశాల ఏర్పాటుకు నిర్వాహకులకు యాజమాన్య హక్కుల్ని షరతులపై బదలాయించారు.

వైసీపీ ప్రభుత్వ హయంలో విశాఖపట్నంను రాజధాని చేయాలని చివరి వరకు ప్రయత్నాలు జరిగాయి. రాజధాని నిర్మాణంపై వివాదాలు తలెత్తడం, న్యాయస్థానాల్లో తలెత్తిన అభ్యంతరాలు నేపథ్యంలో రాజధాని తరలింపు సాధ్యపడలేదు. విశాఖకు అన్ని హంగులు ఉండాలనే లక్ష్యంతో బెంగుళూరుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థకు భూ కేటాయింపులు చేశారు. విశాఖపట్నం నగరాన్ని రాజధాని చేయాలనే లక్ష్యంలో భాగంగా ఇంటర్నేషనల్ స్కూల్‌ పేరుతో భూ కేటాయింపులు జరిగాయి.విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదనల మేరకు విశాఖపట్నం రూరల్‌ మండలంలోని మధురవాడ గ్రామంలోని సర్వే నంబర్‌ 427/1లో ఉన్న 11.25 ఎకరాల భూమిని బెంగుళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చదరపు గజం రూ.65వేల చొప్పున కేటాయించాలని ప్రతిపాదించారు. 2012లో రెవిన్యూ శాఖ భూ కేటాయింపులపై ఖరారు చేసిన విధివిధానాల ఆధారంగా కలెక్టర్‌ ఈ ప్రతిపాదన చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదన సమర్పించే సమయానికి ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ ధర ఎకరా రూ. 31.46కోట్లు ఉంది.విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ చేసిన ప్రతిపాదనలపై 2023 డిసెంబర్ 6న ఏపీ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ సమావేశంలో చర్చించారు. కలెక్టర్‌ ప్రతిపాదనల మేరకు మధురవాడలో ప్రభుత్వ భూముల యాజమాన్య హక్కుల బదలాయింపుకు షరతులతో కూడిన అమోదం లభించింది.ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ పేరిట విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ స్కూల్‌ ఏర్పాటు చేసేందుకు సదరు భూమిని కేటాయించేందుకు కమిటీ అమోదం తెలిపింది. కమిటీ అమోదం తెలిపే సమయానికి మధురవాడలో ఉన్న భూమి ఖరీదు రూ.707కోట్లు ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రభుత్వ భూమి కేటాయింపుకు బదులుగా విద్యాహక్కు చట్టంలో భాగంగా 25శాతం సీట్లను విద్యా హక్కు చట్టం కింద కేటాయించడంతో పాటు మరో 25శాతం స్థానికులకు కేటాయించాలని పేర్కొన్నారు. దీంతో పాటు 2012 నాటి జీవో నంబర్‌ 571కు అనుగుణంగా విధివిధానాలను అమలు చేయాలని పేర్కొన్నారు.

ఆ తర్వాత జరిగిన ఉన్నత స్థాయి సమీక్షల్లో మధురవాడలో ఉన్న భూమిని రూ.11.25కోట్లకు ఇంటర్నేషనల్ స్కూల్‌కు ప్రభుత్వం కేటాయించింది. రూ.31.46 కోట్ల ఖరీదు చేసే ఎకరం భూమి ధరను రూ. కోటి 25లక్షలకు తగ్గించారు.దీంతో పాటు స్థానికులకు 25శాతం సీట్లు, 25శాతం విద్యా హక్కు చట్టం కోటా అమలు చేయాలని పేర్కొన్నారు.ప్రభుత్వం స్కూల్‌ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిని ప్రభుత్వ అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించడం, లీజుకు ఇవ్వడం, అద్దెకు ఇవ్వడం చేయకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో సహజమైన నీటి ప్రవాహాలు ఉంటే వాటికి నష్టం లేకుండా చూడాలని, కేవలం విద్యా సంస్థ ఏర్పాటుకే పరిమితం కావాలని స్పష్టం చేశారు.నిబంధనలు ఉల్లంఘించినా, కేటాయింపు మేరకు భూమిని వినియోగించక పోయినా జిల్లా కలెక్టర్‌కు భూమి కేటాయింపు రద్దు చేసే అధికారం ఉంటుందని, ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్లను కొనసాగించాలని పేర్కొన్నారు. 11ఎకరాల భూమిలో ఉన్న చెరువులు, కుంటలపై యాజమాన్య హక్కులు సంక్రమించవని, వాటిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిగినా ఆ స్థలంలో స్కూల్ ఏర్పాటు చేయలేదు.భూ కేటాయింపులు జరిగిన ఆర్నెల్లలోనే ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ప్రభుత్వం చేసిన భూ బదలాయింపులో షరతులు ఇబ్బందికరంగా ఉండటంతో సదరు భూమిని కొనుగోలు చేయాలని విద్యా సంస్థ భావించింది. దీంతో వైసీపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు కేటాయించిన భూముల్నివారికి అప్పగించేందుకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ఫైల్‌ ప్రస్తుతం వివిధ శాఖ‌ల మధ్య నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రభుత్వ భూములను విక్రయించడంపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. భూముల బదలాయింపు వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో గత ప్రభుత్వం షరతులతో కూడిన యాజమాన్య హక్కుల బదలాయింపు మాత్రమే చేపట్టింది.మరోవైపు విశాఖపట్నం మధురవాడలో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇప్పటికే చెల్లించడంతో ఆ భూములు వారికి అప్పగించాలని మాత్రమే స్కూల్ యాజమాన్యం కోరిందని, ఆ మేరకు ఫైల్‌ పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భూమి కొనుగోలు హక్కులతో పాటు ఇతర మినహాయింపులు తాము కోరలేదని ఇంటర్నేషనల్ స్కూల్ వర్గాలు తెలిపాయి. ఏపీలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు కోసం 2017 నుంచి ప్రతిపాదనలు నడుస్తున్నాయని 2023లో భూ కేటాయింపు జరిగిందని తెలిపారు. మరోవైపు మధురవాడ భూముల వ్యవహారంపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా వివరణ కోరినా ఆయన స్పందించలేదు.

Read more:Andhra Pradesh:రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార

Related posts

Leave a Comment