హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్)
వేసవి సెలవులు తర్వాత తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. ముఖ్యంగా తరగతి గదులను సర్వాంగ సుందరంగా అలంకరించారు.తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని స్కూల్స్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని విద్యార్థులకు ఇవ్వనున్నారు. అయితే ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది.
19 వరకు జరగనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇక స్కూళ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఎస్హెచ్జీ గ్రూపుల సభ్యులు, టీచర్లు, ఇతర ఉన్నతాధికారులుంటారు. స్కూల్స్ పరిధిలో చేపట్టే ప్రతీ పనిని ఈ కమిటీల ద్వారా నిర్వహిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు 600 కోట్ల రూపాయలతో మరమ్మతులు పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ ప్రకటించింది. దీనికి ప్రకారం మొత్తం 229 పనిదినాలు ఉండనున్నాయి.
ఏప్రిల్ 24 వరకు పాఠశాలలు కొనసాగుతాయి. అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే దాదాపు 13 రోజులు దసరా సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 క్రిస్మస్, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ఆరురోజుల పాటు సంక్రాంతి సెలవులుంటాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికి పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు ప్రతీ రోజూ ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు.
గురు కులాలు క్లోజేనా…
తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ.. విద్యార్థుల చదువు కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. కులాలు, మతాల ప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేసింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ గురుకులాల పేరుతో సుమారు వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యా, భోజనంతోపాటు వసతి కూడా కల్పిస్తుండడంతో గురుకులాలకు ఆదరణ పెరిగింది. అడ్మిషన్లకు పోటీ పడుతున్నారు విద్యార్థులు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వం అడ్మిషన్లు కల్పిస్తోంది.ఇక గురుకులాల్లో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్య అందుతోంది. ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు ఉచితంగా ఇంటర్ వరకు చదివే అవకాశం ఉంది.
పుస్తకాలు, యూనిఫాంలు, భోజనంతోపాటు ఉయదం టిఫిన్స్, సాయంత్రం స్నాక్స్ ఇలా రుచికమైన భోజనం కూడా పెడుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తున్నారు. బాలికలు, బాలురకు కూడా వేర్వేరుగా హాస్టల్స్ ఉండడం, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండంతో గురుకులాల విద్యార్థులు ఫలితాల్లోనూ సత్తా చాటుతున్నారు. రెండు రోజుల క్రితం గురుకులాలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పిల్లలను గురుకులాల్లో చేర్పించడం వలన పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ఇటీవల ఓ నివేదిక అందిందని వెల్లడించారు. తద్వారా పిల్లలను చిన్నప్పుడే గురుకులాల్లో చేర్పించడం మంచిది కాదు అని పేర్కొన్నారు. దీంతో రేవంత్ సర్కార్ గురుకులాలను మూసివేస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ఎత్తివేయకపోవచ్చు కాని, ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించకుండా 8వ తరగతిలో కల్పిస్తారని కొందరు పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పేదలకు వరంగా ఉన్న గురుకులాలను ఎత్తివేయొద్దని కోరుతన్నారు. కేసీఆర్ మీద కోపంతో పిల్లల భవిష్యత్తో ఆడుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. గురుకులాలు ఎత్తేయాలని ఆలోచన చేస్తున్నారా అని చాలా మంది ప్రశ్నించారు.