అమరావతి రైతుల కోసం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు
విజయవాడ, నవంబర్ 25, (న్యూస్ పల్స్)
Amaravati
అమరావతి నిర్మాణం కోసం చాలామంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామమని ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లారపు నవీన్ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు శుభవార్త చెప్పారు. వారికి కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నవీన్ వెల్లడించారు.తాజాగా.. గవర్నర్‌పేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో గతంలో రిటర్నబుల్ ప్లాట్లు అందుకోని రైతులకు.. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారం లోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
లాటరీకి హాజరైన రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు లాటరీ తీశారు. ముందు ట్రయల్ రన్ వేసి, ఆ తర్వాత ప్రత్యక్ష లాటరీ నిర్వహించారు. ప్లాట్లు పొందిన రైతులకు వారి ప్లాట్లు ఎక్కడ కేటాయించారో వివరించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.ఇటీవల నవులూరు, బోరుపాలెం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి, నిడమర్రు, అనంతవరం, మందడం గ్రామాలకు చెందిన 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్లు అందించారు. భూములిచ్చిన రైతులకు దశల వారీగా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం ద్వారా.. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెంది రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు వివరిస్తున్నారు.
అమరావతి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్మెంట్, డీపీఆర్, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా.. 2019లో ప్రభుత్వం మారడంతో.. ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ అడుగులు పడటంతో.. ప్లాట్లు పొందిన రైతులకు లబ్ధి చేకూరనుంది.రింగ్ రోడ్డు ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు.
తూర్పు భాగం 78 కి.మీ వరకు ఉంటుంది. పశ్చిమ భాగం 111 కి.మీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 189 కి.మీ ఉండనుంది. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ఆర్వోడబ్ల్యూ, మూడు సొరంగాలు, తొమ్మిది ఇంటర్‌ఛేంజీలు, కృష్ణా నదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకు లింక్ కానుంది.