All eyes on Amaravati… | అమరావతిపై అందరి కళ్లు… | Eeroju news

Amaravati lands

అమరావతిపై అందరి కళ్లు…

విజయవాడ, జూన్ 27, (న్యూస్ పల్స్)

All eyes on Amaravati

హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టేందుకు సైబరాబాద్‌కు తానే అంకురార్పణ చేశానని.. అభివృద్ధిని చేశానని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు తనకు మరోసారి రాజధానిని అభివృద్ధి  చేసే అవకాశం ఇచ్చారని .. దాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పేవారు. అందుకే సెక్రటేరియట్, అసెంబ్లీ, ఉద్యోగుల క్వార్టర్స్, రాజ్ భవన్ వంటివి కట్టి అదే రాజధాని అనిపించుకునే అవకాశం ఉన్నా..  రాజధానిని ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మార్చాలన్న పట్టుదలతో అమరావతికి రూపకల్పన చేశారు. చంద్రబాబు ఈ సిటీ కోసం అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి   పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.  ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాలి.. ఎలా నిధుల సమీకరణ చేయాలన్న అంశాలపై ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నారు.

ఈ మేరకు అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 50ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం… అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 55,343 కోట్లు. ఇందులో  8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది కేవలం 6629 కోట్లు . రాజధానిని ప్రభుత్వం మొదటి నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ గా చెబుతూ వస్తోంది. భూములకు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత.. వాటి విలువ పెరుగుతోంది. అప్పుడు .. ప్రభుత్వానికి మిగిలే భూమితో సంపాదించుకునే ప్రణాళికలను ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే పెద్దగా పెట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనుంది. అమరావతిలో ఆర్థిక నిపుణలు ఓ గొప్ప ఆర్థిక నమూనాను చూశారు.

పట్టణీకరణకు ఓ అద్భుతమైన దిక్సూచీగా మారబోతోందని అంచనా వేశారు. 33వేల ఎకరాలు సమీకరించిన విధానం.. ఆ ప్రాజెక్ట్ పై దేశవ్యాప్తంగా విశ్వాసం పెరగడానికి కారణం అయింది. ఆ ప్రాజెక్ట్‌కు ఎంత క్రేజ్ వచ్చిందంటే రూ. రెండు వేల కోట్ల రుణం కోసం..సీఆర్డీఏ బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ అయితే  ఆ మొత్తం నిమిషాల్లోనే వచ్చింది. సాధారణంగా  ప్రభుత్వాలకు చెందిన వాటిలో పెట్టుబడులు పెట్టడానికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపరు. గతంలో పలు నగరాలు.. అలాంటి ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. అమరావతి మోడల్ సక్సెస్ అయితే పట్టణీకరణలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఎందుకంటే వరల్డ్ క్లాస్ సిటీ సెల్ఫ్ ఫైనాన్షింగ్ ద్వారా పూర్తి కావడం అంటే ఓ గొప్ప సక్సెస్ మోడల్ దొరికినట్లే.  అమరావతిపై జగన్ ప్రభుత్వ విధానం అందుకే విమర్శల పాలైంది.  ప్రఖ్యాత ఆర్థికవేత్తలు.. బిజినెస్ మీడియాకూడా.. తప్పు పట్టింది.

మొదటి బడ్జెట్‌లో అమరావతికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చిన వైనం.. ఆ తర్వాత సింగపూర్ తో ఒప్పందం రద్దు చేసుకోవడం వంటి ఆంశాలపై.. బిజినెస్ నిపుణులు తీవ్రంగా స్పందించారు. మోహన్ దాస్ పాయ్ లాంటి పారిశ్రామికవేత్తలు.. శేఖర్ గుప్తా లాంటి జర్నలిజం దిగ్గజాలు కూడా..అమరావతిపై జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ జగన్ తాను అనుకున్నదే  చేశారు. ఫలితంగా ఐదేళ్లు ప్రాజెక్టు మూలనపడింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి ఆశలు చిగురించాయి.2015 అక్టోబ‌ర్ 24 నాడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చేతుల మీదుగా రాజ‌ధాని నిర్మాణం కోసం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం   నిర్వ‌హించారు. ట్రాన్సిట్  సచివాలయం,  అసెంబ్లీ భ‌వ‌నం,  హైకోర్టు నిర్మాణాలు పూర్త‌య్యాయి. వినియోగంలోకి వ‌చ్చాయి. డిజైన్ల విష‌యంలో జాప్యం జ‌ర‌గ‌డంతో సీడ్ క్యాపిట‌ల్ నిర్మాణంలో ఆల‌స్యమైంది.

ఐఏఎస్ అధికారుల భ‌వ‌న స‌ముదాయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ స‌ముదాయం, ఎన్జీవోల హౌసింగ్ స‌హా ప‌లు నిర్మాణాలు చివరి దశకు వచ్చాయి. తొలి ద‌శ ప‌నుల్లో మొత్తం 12,986 కోట్ల‌తో రోడ్ల నిర్మాణం చేపట్టారు.  ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, గృహాల కోసం రూ. 5,883 కోట్లు, భూస‌మీక‌ర‌ణ కోసం రూ.12,545 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడ ఆగిపోయాయో.. ఐదేళ్ల తర్వాత పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ అక్కడ్నుంచే ప్రారంభిస్తోంది. గతంలో  మొదటి సారి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించడం, భూమీకరణ, మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయడం, జాతీయ హరిత ట్రిబ్యూనల్ లో కేసులు అన్నీ పరిష్కరించుకునే సరికి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ సారి అలాంటి సమస్యలు లేవు. పునాదుల మీద నుంచి పనులు ప్రారంభించడమే. అందుకే గతంలో పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలతో కాంట్రాక్ట్ తీరిపోయింది.

ఇప్పుడు మళ్లీ కొత్తగా కాంట్రాక్టులు చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం  నిర్మాణ సంస్థలతో మళ్లీ చర్చలు ప్రారంభించింది. జంగిల్ క్లియరెన్స్ చేయిస్తున్నారు. తొలి దశ రాజధాని పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. దానికి తగ్గట్లుగానే ేర్పాట్లు చేసుకుంటోంది.చంద్రబాబు అమరావతిని రాత్రికి రాత్రి లేదా ఓ ఐదేళ్లకో.. పదేళ్లకో అభివృద్ధి చేయాలని టార్గెట్ పెట్టుకోలేదు. ఓ క్రమబద్ధమైన అభివృద్దితో.. సుదీర్ఘమైన ప్రణాళికే  పెట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం  తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, మండలాలలోని 29 గ్రామల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో  సీడ్ క్యాపిటల్ ఉంటుంది. అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మిస్తారు.

రాజధాని అంటే కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. దేశ,విదేశాలలో పలు నగరాలను చూసి, వాటి స్ఫూర్తితో ఈ విధంగా ప్రత్యేక నగరాలు నిర్మించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.

విశాలమైన రోడ్లు, వాటిలో సైకిల్ ట్రాక్ లు, పచ్చదనం పరిచినట్లు పచ్చికబయళ్లు, పూల మొక్కలు, చల్లదనాన్ని ఇచ్చే చెట్లు, ఫౌంటెన్లు…. ఇలా అందమైన ఓ సుందర నగరం ఏర్పడుతుంది. ఈ నగరాలను కలుపుతూ మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు. విజయవాడ, గుంటూరుల నుంచే కాకుండా రాయలసీమ,ఉత్తరాంధ్ర నుంచి కూడా అమరావతికి అనుసంధానం చేస్తూ ఆరు లైన్ల రోడ్లు నిర్మిస్తారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తారు. కనీసం పాతికేళ్ల ప్రణాళిక ఇందులో ఉంది.వచ్చే ఐదేళ్లు అమరావతి నగరానికి అత్యంత కీలకం. పరిపాలనా నగరాన్ని రెండు, మూడేళ్లలో పూర్తి చేయడంతో పాటు తదుపరి దశకు పునాదులు వేయాల్సి ఉంటుంది.

అదే సమయంలో అమరావతిని జీవించడానికి అనువుగా ఉండే నగరంగా మార్చాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాల్సి ఉంటుంది. అంటే.. ఆఫీసులన్నీ తరలి వచ్చేలా చూడాలి. ఇప్పటికే వందకుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించారు. గతంలో ప్రముఖ విద్యా సంస్థలకు.. వ్యాపార సంస్థలకు స్థలాలు కేటాయించారు. వారంద్నీ ఒప్పించి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చేయాల్సి ఉంది. చంద్రబాబుకు అతి పెద్ద సవాల్.  వచ్చే ఐదేళ్లలో అమరావతి మొదటి దశను మాస్టర్ ప్లాన్‌లో చెప్పినట్లుగా రూపొందించడం. అదే చేయగలిగితే.. ఆయన తన రాజధాని స్వప్నానికి ఓ రూపం ఇచ్చుకున్నట్లే. ఏపీ రాజధానిగా అమరావతిని ఠీవీగా నిలబెట్టినట్లే.

All eyes on Amaravati

 

అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక భరోసా | Amaravati is a financial guarantee for Andhra Pradesh | Eeroju news

Related posts

Leave a Comment