Agrigold trees destroyed in Anantapur | అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం… | Eeroju news

Agrigold trees destroyed in Anantapur

అనంతపురంలో అగ్రిగోల్డ్ చెట్లు మాయం…

అనంతపురం, ఆగస్టు 20, (న్యూస్ పల్స్)

Agrigold trees destroyed in Anantapur

వందలు వేలు కాదు, ఏకంగా కోట్ల ఖరీదు చేసే విలువైన వృక్ష సంపదకు రెక్కలొచ్చాయి. దాదాపు పదేళ్లుగా ఆలనపాలన లేకపోవడంతో కొందరు అక్రమార్కులకు కన్ను కుట్టింది. గుట్టు చప్పుడు కాకుండా వందల ఎకరాల్లో చెట్లను మాయం చేసేశారు. అసలు ఎక్కడ ఎంత సంపద ఉందో కూడా తెలియకుండా రికార్డులు తారుమారు చేసేశారనే ఆరోపణలు ఉన్నాయి.అగ్రిగోల్డ్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్, సీఐడీ స్వాధీనంలో ఉన్న ఫ్యాక్టరీలో యంత్రపరికరాల చోరీ విషయం మరువక ముందే కోట్ల రుపాయల విలువైన వృక్షాలు మాయమైన వ్యవహారం వెలుగు చూసింది.

2015లో అగ్రిగోల్డ్‌ అక్రమాలపై ఏలూరులో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవహారం పాకినట్టు గుర్తించారు. దాదాపు రెండు మూడేళ్ల పాటు సాగిన ప్రాథమిక దర్యాప్తులో వేల ఎకరాల భూముల్ని సీఐడీ అటాచ్ చేసింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా వీటిని జప్తు చేసింది. సీఐడీ, ఈడీలలో ఎవరికి అగ్రిగోల్డ్‌ ఆస్తులపై హక్కు ఉంటుందనే వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ కేసులు అలా నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని అందినకాడికి దోచుకునే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నాయి.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వందలాది ఎకరాలను అటాచ్‌ చేశారు. వీటిలో విలువైన వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్లు, కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా వందలాది ఎకరాల భూమిని దర్యాప్తు సంస్థలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఎనిమిదేళ్లుగా వాటి బాగోగులు మాత్రం మరచిపోయారు.అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి ముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో శ్రీగంధం, చందనం, నీల్‌గిరి, సుబాబుల్‌ ప్లాంటేషన్లు చురుగ్గా నడిచాయి. తీర ప్రాంతాలు, పెద్దగా నీటి సదుపాయం లేని భూముల్లో పండే మొక్కల్ని పెంచుతూ వచ్చారు. కొన్ని చోట్ల శ్రీగంధం, ఎర్ర చందనం వంటి వాటిని కూడా సాగు చేశారు.

ఎనిమిదేళ్లుగా ఈ మొక్కల్ని పట్టించుకున్న వారు లేరు.ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో వందలాది ఎకరాల్లో సాగు చేసిన చెట్లు కోతకు రావడాన్ని కొందరు అధికారులు గుర్తించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని జప్తు చేసిన సమయంలోనే వాటిని జియోఫెన్సింగ్ చేసి సంరక్షించాలనే సంగతిని సీఐడీ గాలికి వదిలేసింది. దీంతో ఎన్నికల సమయంలో అంతా హడావుడిగా ఉన్న సమయంలో విలువైన చెట్లను నరికేసి సొమ్ము చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్‌ అధికారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ ఎన్ని చెట్లను నరికేశారనే లెక్కలు ఇప్పటికీ లేవు. అగ్రిగోల్డ్ ప్లాంటేషన్లలో చెట్ల నరికివేతలపై కేసుల విచారణ జరుగుతున్న ఏలూరు కోర్టులో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు కొద్ది రోజుల క్రితం పిటిషన్లు వేశారు.

కోట్ల రుపాయల ఖరీదు చేసే మొక్కల్ని నరికివేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని వాటిని వేలం వేస్తే డిపాజిటర్లకు నగదు చెల్లించవచ్చని సూచించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం పీపీని ప్రశ్నించడంతో బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పినా ఆ తర్వాత ఆ సంగతి వదిలేశారు. అనంతపురం జిల్లా పెనుకొండతో పాటు, రొద్దం మండలం పెద్ద గువ్వలపల్లిలో నీలగిరి చెట్లను నరికేసి అమ్మేశారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం వెనిగొండ్లలో ఉన్న ప్లాంటేషన్ సైట్లో కూడా చెట్లను మాయం చేశారు. ఒక్కో ప్లాంటేషన్ యూనిట్‌ 100 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని ఎన్నికల హడావుడిలో ఈ చెట్లను మొత్తం నరికి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు చెట్ల నరికివేతపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టు సీఐడీ కోర్టులో పేర్కొన్నా చోరీకి గురైన చెట్ల విలువను ఎలా రాబడుతారనే దానికి మాత్రం సమాధానాలు లేవు. ఈ మొత్తం వ్యవహారం సీఐడీలో కీలక పాత్ర పోషించిన అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల పరిధిలోని పెద్దగువ్వలపల్లి గ్రామంలో ఉన్న 112 ఎకరాల అగ్రి గోల్డ్ భూముల్లో నీలగిరి చెట్లను ఇటీవల నరికేశారు. ఈ వ్యవహారంలో ఓ మహిళా మంత్రి చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డ్‌ భూముల్లో పెరుగుతున్న నీలగిరి చెట్లు కోతకు రావడంతో మంత్రి అనుచరులు వాటిని నరికి సొమ్ము చేసుకున్నారు. పగలు చెట్లను నరికి రాత్రిపూట కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఈ వ్యవహారంపై అటవీ శాఖ, సీఐడీ చర్యలు తీసుకోకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు.

Agrigold trees destroyed in Anantapur

 

Even in Jagananna’s colonies… there are manipulation | జగనన్న కాలనీల్లోనూ… అవకతవకలే | Eeroju news

Related posts

Leave a Comment