కబ్జాలో అగ్రిగోల్డ్ భూములు | Agrigold lands in possession | Eeroju news

కబ్జాలో అగ్రిగోల్డ్ భూములు

విజయవాడ, జూన్ 18, (న్యూస్ పల్స్)

Agrigold lands in possession

ఖాతాదారుల్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు సాగుతుండగానే అటాచ్‌ చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3వేల గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదు అవుతున్నాయి.నాలుగైదు రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

ఈ క్రమంలో అగ్రిగోల్డ్‌ వ్యవస్థాపకులు సంపాదించిన స్థిర, చరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అగ్రిగోల్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల్ని సిఐడి అటాచ్ చేసింది.అలాంటి భూముల్లో విజయవాడ రూరల్‌ మండలం సర్వే నంబర్ 87లో ఉన్న 3వేల గజాల భూమి కూడా ఉంది. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు అవ్వా రామారావు తండ్రి అప్పారావు పేరిట ఈ భూమిని 2002లో కొనుగోలు చేశారు. ఆయన తన మనుమళ్ల పేరిట ఆ భూమిని రిజిస్టర్ చేశారు. 2005లో సర్వే నంబర్ 88 పేరుతో 3వేల గజాల భూమిని ఒకరు రిజిస్ట్రేషన్ జరగ్గా దానిని మాజీ మంత్రి కుమారుడు కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించారు.

ఈ క్రమంలో అవ్వా అప్పారావుకు చెందిన 3వేల గజాల భూమినే తమ భూమి పేర్కొంటూ ఫెన్సింగ్ వేశారు.అగ్రిగోల్డ్‌ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత సిఐడి అటాచ్ చేసిన భూముల్లో సర్వే నంబర్ 87లో ఉన్న భూమి కూడా ఉంది. తమ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో బాధితులు రూరల్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. సర్వే తర్వాత లిటిగేషన్ సృష్టించడానికి సర్వే నంబర్ 92ను తెరపైకి తెచ్చినట్టు తాసీల్దార్ ధృవీకరించారు. మాజీ మంత్రి తనయుడి పేరుతో రిజిస్టర్ చేసిన భూముల్లో సర్వే నంబర్లను మార్చినట్టు గుర్తించి నివేదిక రూపొందించారు.

ఈ వ్యవహారంపై సిఐడి కేసు నమోదు చేసే సమయానికి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి తాను సెటిల్ చేస్తానంటూ సర్ది చెప్పి ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అప్పటికే ఎన్నికల హడావుడి ఉండటం, రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి, వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చి ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది.సిఐడి అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని కబ్జా చేసిన భూమిని అధికార పార్టీ నాయకుడు కబ్జా చేశాడని తెలిస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రి కుమారుడి పేరుతో కబ్జా చేసిన భూమిని ఆ తర్వాత విజయవాడ కార్పొరేషన్‌లో కీలకంగా ఉన్న మహిళా కార్పొరేటర్ అనుచరుల పేర్లకు కొంత భూమిని బదలాయించారు.మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా దానిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ భూమిలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో దాడికి ప్రయత్నించిన సదరు నాయకుడు ఎన్నికలకు ముందే భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలించలేదని తెలుస్తోంది.

 

కబ్జాలో అగ్రిగోల్డ్ భూములు | Agrigold lands in possession | Eeroju news

Related posts

Leave a Comment