అఘోరీ లక్ష్యాలు ఏంటీ… ఎందుకీ రచ్చ
విజయవాడ, నవంబర్ 19, (న్యూస్ పల్స్)
Aghori
అసలు అఘోరీ మాత టార్గెట్ ఏమిటో రోజురోజుకు ప్రజల మద్దతు కూడగట్టుకోవడం ఏమో కానీ, వ్యతిరేక పవనాలు మాత్రం వీస్తున్నాయని టాక్. సనాతన ధర్మ పరిరక్షణ ఒక్కటే లేడీ అఘోరీ లక్ష్యమైతే ఎందుకింత రచ్చ? రహదారిపై బైఠాయింపు ఎందుకు? అసలు ఆమె ఏం కోరుకుంటోందనేది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.లేడీ అఘోరీ అంటేనే అందరికీ పరిచయం. కారణం సోషల్ మీడియా వేదికగా ఈమెపై సాగిన ప్రచారాలు కూడా అన్నీ ఇన్నీ కావు. ముత్యాలమ్మ ఆలయంపై దాడి సమయంలో వెలుగులోకి వచ్చిన లేడీ అఘోరీ, సనాతనధర్మ పరిరక్షణ తన భాద్యత అంటూ ప్రకటించారు ఆ సమయంలో. అలా తెలంగాణలో అడుగుపెట్టిన కొద్దిరోజులకే పలు ఛానల్స్ కి పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.
అంతవరకు ఓకే ఈ లేడీ అఘోరీ వస్త్రధారణ పాటించక పోవడంతో, పలు చోట్ల వివాదాలు సైతం సాగాయి. కార్తీకమాసంలో వైజాగ్ పర్యటనకు వెళ్ళిన అఘోరీ మాతకు అక్కడి గురువులు వస్త్రధారణ పాటించాలని, సమాజంలో తిరిగే సమయంలో తప్పక పాటించాలని సూచిస్తూ అక్కడే వస్త్రధారణ పాటించేలా చొరవ చూపారుఇక అక్కడి నుండి శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో అయితే, వస్త్రధారణ పాటించక పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ ఆత్మార్పణకు యత్నించడం, సాయంత్రం ఎర్రటి వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించడం శుభపరిణామం.
ఆ తర్వాత దురదృష్టవశాత్తు కారుకు ప్రమాదం, ఆ తర్వాత యాగంటి దర్శనం కాలినడక సాగించడం కూడా తెలిసిందే. ఇక తెలంగాణలోకి ప్రవేశించిన అఘోరీ మాత శంషాబాద్ లో ఆలయానికి వెళ్ళిన సమయంలో పోలీసులకు, ఆమెకు వాగ్వివాదం సాగింది. అనంతరం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించనని తెలపడం కూడా సబబే. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరడం సబబే. కానీ తాను ఒక వ్యక్తి మర్మాంగం కోసేస్తానంటూ ప్రకటించడం వివాదంగా మారింది. అంతేకాదు వేములవాడ ఆలయంలో దర్గాను సుత్తితో కొట్టి ధ్వంసం చేస్తానని ప్రకటించడం కూడా వివాదంగా మారింది.మళ్లీ మంగళగిరికి వెళ్లి అక్కడ కారు వీడియో తీస్తున్న యువకులను విచక్షణారహితంగా కర్రతో దాడి చేశారు.
అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. శరీరంపై వస్త్రధారణ పాటించకుండా.. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేంత వరకు కదిలే ప్రసక్తేలేదంటూ అఘోరీ జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్కడికి వచ్చిన పోలీసులపై దాడికి పాల్పడడం, గుమికూడిన ప్రజలను దుర్భాషలు ఆడడం సంచలనంగా మారింది. అనంతరం ఎలాగోలా పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.అసలు సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడితే ప్రజల మద్దతు, భక్తుల ఆదరణ పొందడం సర్వసాధారణంగా జరుగుతుంది.
కానీ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ.. ధర్మ పరిరక్షణ అంటూ అంశాన్ని పైకి లేవనెత్తడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు శాంతియుత మార్గంలో అఘోరీ నడవాలి కానీ ఇదేమిటి ఇది.. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ మంగళగిరి వాసులు ఘర్షణ జరుగుతున్న సమయంలో చర్చలు జరపడం విశేషం. ఏదిఏమైనా అసలు అఘోరీ మనసులో ఏముందో ఎవరికెరుక.. ఆ భగవంతుడికే ఎరుక అంటున్నారు మరికొందరు భక్తులు