A test for Chief Ministers | ముఖ్యమంత్రులకు పరీక్షే | Eeroju news

A test for Chief Ministers

ముఖ్యమంత్రులకు  పరీక్షే

న్యూఢిల్లీ, జూలై 11 (న్యూస్ పల్స్)

A test for Chief Ministers

వన్ నేషన్ – వన్ ఎలక్షన్” అమల్లోకి వచ్చే వరకు దేశంలో అనునిత్యం ఏదో ఒక మూల ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. యావత్ ప్రపంచం ఆసక్తిగా చూసిన లోక్‌సభ ఎన్నికలు ముగిసాయో లేదో.. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తారుమారు చేసే పరిస్థితి లేనప్పటికీ.. ఓ రెండు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యమంత్రులకు అగ్నిపరీక్షగా మారాయి. ఉప ఎన్నికల్లో ఆయా సీట్లు గెలుపొందితేనే ముఖ్యమంత్రి పదవి పదిలంగా ఉంటుంది. లేదంటే సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటూ పదవిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

బిహార్‌లోని రుపౌలి, మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్ ప్రదేశ్‌లోని డేహ్రా, హమీర్‌పూర్, నాలాగఢ్, బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్డా, మాణిక్‌తలా, తమిళనాడులోని విక్రవండి, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగళౌర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు జరగ్గా.. హిమాచల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ ఎన్నికల ఫలితాలు గుబులు రేకెత్తిస్తున్నాయి.ఈ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో ఉప-ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బీజేపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హోషియార్ సింగ్ (డెహ్రా), ఆశిష్ శర్మ (హామీర్‌పూర్, కేఎల్ ఠాకూర్ (నాలాగఢ్) మళ్లీ తమ తమ స్థానాల నుంచే పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి వారు బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగగా.. ఈ ముగ్గురినీ ఓడించేందుకు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఏకంగా తన సతీమణి కమలేశ్ ఠాకూర్‌ను డెహ్రా నుంచి బరిలోకి దించారు. హామీర్‌పూర్ జిల్లాకు చెందిన సుఖు, అదే జిల్లాలోని నదౌన్ నుంచి ఎమ్మెల్యేగా ఉండగా.. ఇప్పుడు సొంత జిల్లా కేంద్రం హమీర్‌పూర్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలుపు తన ప్రతిష్టకు సవాలుగా మారింది. కొద్ది నెలల క్రితం ఈ రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుపొందేంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఓటమిపాలై ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో తన సతీమణితో పాటు తన సొంత జిల్లాలో గెలిచి తీరాల్సిన అనివార్యత ఏర్పడింది. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగిన మూడు సీట్లలో ఓడినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేనప్పటికీ.. ముఖ్యమంత్రి సుఖు అసమర్థతను మరోమారు చాటి చెప్పినట్టవుతుంది. ఫలితంగా ఆయనకు పదవీగండాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న కసితో పనిచేసి, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో గెలుపొందుతామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పైగా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 42 శాతం ఓట్లు సాధించి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న ఆ పార్టీ, లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 26 శాతానికి దిగజారింది.

సరిగ్గా ఈ తరుణంలో జలంధర్ వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌కు అనివార్యంగా మారింది. లేదంటే తలెత్తబోయే రాజకీయ పర్యవసానాలు ఆయనకు తెలుసు. అందుకే బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్‌ను ఓడించేందుకు ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్‌ కోసం సీఎం మాన్ యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. ఆప్ తరఫున గెలుపొంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శీతల్, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేతిలో ఓడిపోయారు. బీజేపీలో చేరే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

ఈ ఎన్నికలు అటు బీజేపీకి, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ విపక్ష కూటమి లో ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగానే పోటీ చేసి తలపడ్డాయి. ఈ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 5 పర్యాయాలు కౌన్సిలర్‌గా గెలుపొందిన సురీందర్ కౌర్‌ను బరిలోకి దించినప్పటికీ, బీజేపీ-ఆప్ మధ్యనే ముఖాముఖి పోరు నెలకొంది. ఈ పోరులో గెలిస్తేనే భగవంత్ మాన్ పదవీగండం నుంచి బయటపడతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరాఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలు మారిన నేపథ్యంలో రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మారిన పార్టీ నుంచి మళ్లీ పోటీకి దిగిన ఆ నేతలకు గెలుపు సవాలుగా మారగా, ప్రత్యర్థి పార్టీలు ఎలాగైనా సరే తమ పార్టీ వీడిన నేతను ఓడించి బుద్ధి చెప్పాలని చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన ఉప ఎన్నికలు, జులై 13న వెలువడనున్న ఫలితాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

 

A test for Chief Ministers

 

The Integrated Lab Complex was inaugurated by Minister Tummala Nageswara Rao | ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల | Eeroju news

Related posts

Leave a Comment