కరీంనగర్, జూన్ 15, (న్యూస్ పల్స్)
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ ప్రభుత్వం వేసిన కమిషన్లు బీఆర్ఎస్ నేతలకు నోటీసుల మీద నోటీసులు పంపించడంతో అధికారులు షాకవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు, అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. తాజాగా జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ వంతైంది. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులైన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
పీసీ ఘోష్‌ను తన కార్యాలయంలో విలేకరులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అఫిడవిల్లలో ఉన్న వివరాల ఆధారంగా నోటీసులపై తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మరోసారి తనిఖీలకు వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాంకేతిక అంశాలపై విచారణ జరుపుతున్న కమిషన్, త్వరలో ఉల్లంఘనలపై ఫోకస్ చేయనుంది.ముఖ్యంగా డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్కు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టింది. బ్యారేజీ సామర్థ్యం కంటే ఎక్కువగా నీటి నిల్వతో ఒత్తిడి పెరిగి, పునాది కింద నుంచి ఇసుక జారిపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని వివరించింది.
బ్యారేజీల వైఫల్యానికి నీటిని నిల్వ చేయడమే కారణమని నిఫుణుల కమిటీ తేల్చిచెప్పింది. నీటి మళ్లింపు కోసమే వీటిని కట్టారని, నిల్వ చేసేందుకు డ్యామ్‌లు కట్టుకోవాలని స్పష్టం చేసింది.బ్యారేజీలను రిజర్వాయర్ మాదిరిగా వాడుకుని నీటిని నిల్వ చేశారని, మాన్యువల్ పాటించకుండా నీటిని వదిలారని, అందుకే బ్యారేజీలు డ్యామేజ్ అయ్యిందని కమిషన్ వెల్లడించింది. బ్యారేజీలపై రెండువారా ల్లోనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచన చేసింది కమిషన్.
శుక్రవారం కొందరు అధికారులను కమిషన్ విచారించనుంది. అంతేకాదు బ్యారేజీలపై విచారణలో భాగంగా ఓపెన్ కోర్టు కూడా నిర్వహించ నున్నట్లు కమిషన్ ప్రకటించింది. ప్రజలు నేరుగా హాజరై ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే కమిషన్‌కు అందజేయాలని సూచించింది.