వైసీపీ సైలెంట్ ప్లానింగ్….
విశాఖపట్టణం, నవంబర్ 4, (న్యూస్ పల్స్)
YCP
మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నేడు కూటమిపై విమర్శల జోరు సాగిస్తున్నారు. ఎన్నికల ఫలితాల షాక్ నుండి ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు కోలుకుంటున్నారని చెప్పవచ్చు. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కాగా, మాజీ సీఎం జగన్ ఇటీవల నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలన కాలంలో అంతా తానై ముందుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణకు సజ్జల హాజరయ్యారు.అప్పుడు కనిపించిన సజ్జల, తాజాగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఆదివారం తిరుపతిలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని, వాటి బదులుగా నిత్యం ఏదో ఒక అరాచక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
కక్షపూరిత రాజకీయాలకు ఊతమిచ్చే విధంగా వైసీపీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందన్నారు. ఇసుక, మద్యం మాఫియాలకు అడ్డు లేకుండా పోయిందని, ఎవరికి తోచినంత వారు దోచుకుంటున్నారని విమర్శించారు.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు, ప్రస్తుతం సైలెంట్ అయ్యారన్నారు. ఒకటో, రెండో పథకాలు అమలు చేసి తాము హామీలను నెరవేర్చాం అంటూ కూటమి నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారన్నారు. కేవలం 5 నెలల్లో ప్రభుత్వం రూ.53 వేల కోట్ల అప్పు చేసిందని, కానీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదన్నారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ కార్యకర్తలు అందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సజ్జల అన్నారు.మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం ఈసారి కూటమిపై ఘాటుగా కామెంట్స్ చేసి, విరుచుకుపడ్డారనే చెప్పవచ్చు.
ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా వైసీపీకి వచ్చే నష్టం లేదని, తమ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా పార్టీ కోసం శ్రమించి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయాన్ని అందిస్తారన్నారు. ఎప్పుడూ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు చేయని నాని ఈసారి మోదీ కూడా చంద్రబాబు, పవన్ లతో కలిసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, చాలా వరకు నేతలు, అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అటువంటి వారిని తమ పార్టీ అధికారంలోకి వస్తే, వదిలిపెట్టేది లేదని ఓ రేంజ్ లో నాని హెచ్చరించారు. అధికారంలో ఉన్నాం.. వైసీపీని అణచివేద్దాం అనుకుంటూ కూటమి నేతలు అడుగులు వేస్తున్నారని, అణచివేస్తే తలొగ్గే పార్టీ తమది కాదన్నారు.అలాగే చిత్తూరు సభలో వైసీపీ ఎంపీ విజయసాయి మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికల గురించి జోస్యం చెప్పారు.
2027 చివరిలో ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిత్తూరులోని 14 నియోజకవర్గాల గెలుపు బాధ్యత భూమన కరుణాకర్ రెడ్డికే అప్పగిస్తున్నట్లు, కార్యకర్తలను ప్రాణంగా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక నేతలదే అంటూ విజయసాయి సూచించారు.ఇలా జమిలీ ఎన్నికల వార్తల నేపథ్యంలో వైసీపీ స్పీడ్ పెంచి అన్ని జిల్లాల క్యాడర్ ను బలోపేతం చేస్తుండగా, కూటమి మాత్రం పరిపాలనపై పూర్తి దృష్టి సారించి ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే దీపావళి కానుక కింద ఉచితంగా మూడు సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ కూడా అమలులోకి తెచ్చే కార్యాచరణలో ప్రభుత్వం నిమగ్నమైనట్లు సమాచారం.
Sajjala VS Vijay Sai Reddy | సజ్జల వర్సెస్ సాయిరెడ్డి | Eeroju news