నవంబర్ 5న తెలంగాణకు రాహుల్…
విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్)
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. ఎన్నికల తర్వాత ప్రజలకు దగ్గరగా ఉండాలని భావిస్తోంది. కొత్త కొత్త కార్యక్రమం పేరిట ప్రజల్లో ఉండేందుకు ఆలోచన చేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. పాత పద్దతులను దూరం పెట్టింది. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ నేపథ్యంలో నవంబర్ ఐదున తెలంగాణకు రానున్నారు రాహుల్‌గాంధీ.కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ప్లాన్ చేస్తోంది. దానికి ఇప్పటి నుంచే మెల్లగా అడుగులు వేస్తోంది. కేవలం ఎన్నికలకు మాత్రమే వస్తామనే అపవాదును తొలగించే ప్రయత్నం చేస్తోంది.
లేటెస్ట్‌గా ‘సంవిధాన్ సన్మాన్ సమ్మేళన్’ కార్యక్రమం పేరిట తెలంగాణకు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. నవంబర్ ఐదున హైదరాబాద్‌కు వస్తున్నారు. సంవిధాన్ కార్యక్రమం పేరిట ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారాయన.నేతలు, కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని విడమరిచి చెబుతున్నారు. సింగిల్ అజెండాతో రాహుల్‌గాంధీ ముందుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నది ఆయన ఆలోచన. రాజకీయాలు కొన్ని వర్గాల చేతుల్లో ఉందన్నది ఆయన భావన.దేశ జనాభాలో 90 శాతం మంది వ్యవస్థ బయటే ఉన్నారని, 10 శాతం వ్యక్తుల చేతుల్లో రాజ్యాంగం ఉందని భావిస్తున్నారు రాహుల్‌గాంధీ.
మిగతా వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది ఆలోచన.సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వాములను చేయడానికి తొలుత జనాభా సంఖ్యను నిర్ధారించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కింపు మొదలుపెట్టాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. వెనుకబడిన కులాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఉన్నత కులాలకు చెందిన జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కుల గణన ద్వారానే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు కాంగ్రెస్ అగ్రనేత.పనిలో పనిగా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీయనున్నారు రాహుల్‌గాంధీ. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించనున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి పార్టీ నేతలకు కీలక సూచనలు ఇవ్వనున్నారు.